తెలంగాణ సహా 9 రాష్ట్రాల్లో బీజేపీ విస్తారక్‌ల నియామకం
160 ఎంపీ స్థానాలు, ప్రతి అసెంబ్లీ సీటుపై గురి
నిత్యం పర్యటనలు..ఎప్పటికప్పుడు నివేదికలు
*ఈ నెలాఖరులో రాష్ట్రానికి అమిత్ షా*
న్యూఢిల్లీ: ఈ ఏడాదిలో ఎన్నికలు జరిగే తెలంగాణ సహా తొమ్మిది రాష్ట్రాల్లోని ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంతో పాటు, ఈ రాష్ట్రాల్లో గుర్తించిన 160 లోక్‌సభ స్థానాల్లో పార్టీ విస్తరణ, అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా పార్టీ విస్తారక్‌లను భారతీయ జనతా పార్టీ రంగంలోకి దింపింది. ఎంపిక చేసిన స్థానాల్లో పూర్తి సమయం కేటాయించనున్న విస్తారక్‌ల ద్వారానే పార్టీ కార్యాచరణ, ఎన్నికల వ్యూహాలు అమలు చేయడంతో పాటు ప్రచారం నిర్వహించనుంది.
2024లో జరిగే సార్వత్రిక ఎన్నికలకు ముందు పార్టీ బలాన్ని పెంపొందింపజేయడం, నేతల పనితీరును మెరుగుపరచడం లాంటి బాధ్యతలన్నింటినీ ప్రచారక్‌ల భుజాలపై మోపింది. ఇక ఎన్నికల సన్నాహాలకు సంబంధించిన నివేదికలను సిద్ధం చేయడంతో పాటు, పార్టీ ఆదేశించిన కార్యక్రమాల అమలును పర్యవేక్షించే బాధ్యత విస్తారక్‌లకు కట్టబెట్టింది.
*అంతర్గత విభేదాలకు చెక్*
విస్తారక్‌లు ప్రతిరోజూ వారికి కేటాయించిన నియోజకవర్గంలో పర్యటిస్తూ, మండల, మున్సిపల్ నేతలతో సమన్వయం చేసుకుంటూ, పార్టీ దృష్టి సారించాల్సిన ప్రాంతాలను గుర్తిస్తారు. ఆయా ప్రాంతాల్లో నేతల మధ్య ఉండే అంతర్గత విభేదాలను పరిష్కరించడంలో, బూత్ స్థాయిలో పార్టీ ఉనికిని బలోపేతం చేయడంలో చొరవ తీసుకుంటారు అని బీజేపీ సీనియర్ నేత ఒకరు వెల్లడించారు.
ఎప్పటికప్పుడు స్థానిక పరిస్థితులను జిల్లా అధ్యక్షుడి నుంచి జాతీయ నేతల వరకు నివేదిస్తారని తెలిపారు. ఇందుకోసం విస్తారక్‌లకు రెగ్యులర్‌గా శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సహా ప్రధాన కార్యదర్శులు విస్తారక్‌లతో నిత్యం టచ్‌లో ఉంటూ పార్టీ కార్యక్రమాలను పర్యవేక్షిస్తారని వివరించారు.
*నేతల పర్యటనలపై అంతర్గత షెడ్యూల్*
ఇక ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో జాతీయ నేతల పర్యటనలపై బీజేపీ ఇప్పటికే అంతర్గత షెడ్యూల్‌ను రూపొందించుకుంది. ఈ తొమ్మిది రాష్ట్రాల్లో ప్రతి పదిహేను రోజులకు ఒక జాతీయ స్థాయి నేత పర్యటన ఉండేలా ప్రణాళిక రూపొందించుకుంది. మార్చిలో ఎన్నికలు జరిగే కర్ణాటకలో ఈ నెల 5, 6 తేదీల్లో నడ్డా పర్యటించనుండగా, 12న ప్రధాని నరేంద్ర మోదీ పర్యటిస్తారు. లోక్‌సభ ప్రవాస్ ప్రచారంలో భాగంగా ఈ ఒక్క నెలలోనే కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఎన్నికలు జరిగే 8 రాష్ట్రాల్లో పర్యటించనున్నారు. ఇందులో తెలంగాణ సైతం ఉందని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. ఈ నెలాఖరులో తెలంగాణ పర్యటన ఉంటుందని, లేనిపక్షంలో ఫిబ్రవరి తొలివారంలో ఉంటుందని వెల్లడించాయి.