హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు భోగి పండుగను ఘనంగా జరుపుకుంటున్నారు. పల్లెలు, పట్టణాల్లో భోగి మంటల కాంతులు విరజిమ్ముతున్నాయి. తమ కష్టాలను తొలగించాలని ప్రజలు అగ్ని దేవుడిని ప్రార్థిస్తున్నారు. తెల్లవారుజాము నుంచే భోగి మంటలతో ఇండ్ల ముందు రంగురంగుల ముగ్గులు వేస్తూ చిన్నాపెద్దా సందడి చేస్తున్నారు. హైదరాబాద్లోని కూకట్పల్లి మలేషియా టౌన్షిప్లో భోగి వేడుకలను వైభవంగా నిర్వహిస్తున్నారు.
ఇక కేబీఆర్ పార్క్ వద్ద భారత్ జాగృతి ఆధ్వర్యంలో భోగి వేడుకలు నిర్వహిస్తున్నారు. ఈకార్యక్రమంలో జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సాంస్కృతిక కార్యక్రమాలు, గంగిరెద్దుల ఆటలు అందరినీ అలరించాయి.
*అసలు భోగి మంటలు ఎందుకు వేస్తారు..?*
సాధారణంగా చలికాలం కాబట్టి వెచ్చదనం కోసం భోగి మంటలు వేస్తారని భావిస్తారు. కానీ ఇది వెచ్చదనం కోసం మాత్రమే కాదు, ఆరోగ్యం కోసం కూడా. ధనుర్మాసం నేలంతా ఇంటి ముందు పెట్టిన గొబ్బెమ్మలను పిడకలుగా చేస్తారు. వాటినే ఈ భోగి మంటలలో వాడుతారు. ఆవుపేడతో చేసిన పిడకలని కాల్చడం వల్ల గాలి శుద్ధి అవుతుంది. సూక్ష్మక్రిములు నశించి, ఆక్సిజన్ గాలిలోకి అధికంగా విడుదలవుతుంది. దీనిని పీల్చడం ఆరోగ్యానికి మంచిది. చలికాలంలో అనేక వ్యాధులు ప్రబలుతాయి. ముఖ్యంగా శ్వాసకు సంబంధించిన అనేక రోగాలు పట్టి పిడిస్తాయి. భోగి మంటల నుంచి వచ్చే గాలి వాటికి ఔషధంగా పని చేస్తుంది. భోగి మంటల్లో రావి, మామిడి, మేడి మొదలైన ఔషద చెట్ల కలప, ఆవు నెయ్యి వేస్తారు. ఈ ఔషద మూలికలను ఆవు నెయ్యి, ఆవు పిడకలని కలిపి కాల్చడం వల్ల విడుదల అయ్యే గాలి అతి శక్తివంతమైంది. ఇది ఒకరకంగా అగ్ని దేవుడికి ఆరాధన, మరోరకంగా గాలిని శుద్ధి చేస్తూ వాయుదేవునికి ఇచ్చే గౌరవం కూడా.
ఇక దక్షిణాయనానికి చివరి రోజుగా భోగిని భావిస్తారు. అందుకే దక్షిణాయనంలో పడ్డ కష్టాలు, బాధలను భోగి మంటల రూపంలో అగ్ని దేవుడికి సమర్పించి రాబోయే ఉత్తరాయణ కాలంలో సుఖసంతోషాలను ప్రసాదించాలనే పరమార్థమే భోగి పండుగ విశిష్టత. అంతేకాదు ఈ భోగి పండుగ వస్తూవస్తూ సంవత్సరానికి సరిపడా ధాన్యాన్ని వెంటతెస్తుంది.. భోగ భాగ్యాలు ప్రసాదించే పండుగతోనే సంబురాలు మొదలవుతాయి.