ఖమ్మంలో విందు రాజకీయం.. సత్తా చాటేందుకు సిద్ధమైన తుమ్మల, పొంగులేటి

ఖమ్మం:నూతన సంవత్సర వేడుకలు ఖమ్మం జిల్లాలో రాజకీయ వేడి పుట్టించాయి. ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ముఖ్య నాయకులంతా విందు రాజకీయాలకు తెర లేపారు. రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్‌ తన సొంత నియోజకవర్గం ఖమ్మంలోని 17వ డివిజన్‌ నుంచి వాడ వాడకు పువ్వాడ పేరుతో పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. ప్రతి డివిజన్‌లో స్థానిక నాయకులు, ప్రజలను కలుస్తూ వారి సమస్యలు తెలుసుకుని పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నారు. మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరారవు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి న్యూ ఇయర్‌ సందర్భంగా విందు రాజకీయాలకు తెర లేపారు.
ఆత్మీయ కలయిక పేరుతో తుమ్మల

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో క్రియాశీలకంగా వ్యవహరించే మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి రాజకీయ భవితవ్యంపై రాష్ట్రవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో కొత్త సంవత్సరం ఆరంభంలోనే ఇద్దరు నేతలు తమ సత్తా చాటేందుకు విందు రాజకీయాలకు శ్రీకారం చుట్టారు. మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గతంలో ప్రాతినిథ్యం వహించిన పాలేరు నియోజకవర్గం పరిధిలోని ఖమ్మం గ్రామీణ మండలంలో నూతన గృహ ప్రవేశ కార్యక్రమం ఏర్పాటు చేశారు. పాలేరు నియోజకవర్గానికి చెందిన తుమ్మల అభిమానులు, నాయకుల ఆత్మీయ కలయిక పేరుతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాతో పాటు పాలేరు నియోజకవర్గం నుంచి తుమ్మల అభిమానులు భారీగా తరలివచ్చి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. భవిష్యత్తులో తామంతా తుమ్మల వెంటే ఉంటామని నాయకులు స్పష్టం చేశారు. ఖమ్మం జిల్లా అభివృద్ధికి తుమ్మల చేసిన కృషిపై దాదాపు 10వేల పుస్తకాలు ముద్రించి పంపిణీ చేస్తున్నారు. తుమ్మల మళ్లీ పాలేరు నుంచే పోటీ చేయాలని వారు డిమాండ్‌ చేస్తున్నారు. అయితే, ప్రస్తుతం పాలేరు నియోజకవర్గంలో భారాస ఎమ్మెల్యే కందాల ఉపేందర్‌రెడ్డి ఉన్నారు. భారాస తరఫున కచ్చితంగా తానే పోటీ చేస్తానని ఆయన చెబుతున్నారు. ఈ నేపథ్యంలో భారాస శ్రేణులు గందరగోళానికి గురవుతున్నారు.

భారాసలో ఎలాంటి గౌరవం దక్కిందో తెలుసు: పొంగులేటి
మరో వైపు మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి నూతన సంవత్సర వేడుకల సందర్భంగా కార్యకర్తలు, అభిమానుల కోసం తన నివాసంలో ఆత్మీయ విందు ఏర్పాటు చేశారు. ఖమ్మం, భద్రాద్రి జిల్లాల నుంచి తరలివస్తున్న నాయకులు, కార్యకర్తలు ఆయనకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ సందర్భంగా పొంగులేటి కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ.. ‘‘భారత రాష్ట్ర సమితి (భారాస)లో గత నాలుగేళ్లుగా మనకు ఎలాంటి గౌరవం దక్కిందో మీ అందరికీ తెలుసు. భవిష్యత్తులో ఎలాంటి గౌరవం దక్కాలని మీరు భావిస్తున్నారో కూడా నాకు తెలుసు. మీ అందరి మనసులో ఏముందో తెలుసు.. కానీ, ఇంకా ఓపిక పట్టాల్సిన అవసరం ఉంది’’ అని పార్టీ శ్రేణులకు ఒక సంకేతమిచ్చారు. వచ్చే ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లో తాను పోటీ చేస్తానని స్పష్టం చేశారు. భద్రాచలం, మధిర మినహా మిగిలిన అన్ని నియోజకవర్గాల్లోనూ భారాస ఎమ్మెల్యేలే ఉన్నారు. ఖమ్మం జిల్లాలో ఆయనతో పాటు తన అనుచరులు కూడా అన్ని నియోజకవర్గాల్లో పోటీ చేస్తారని పొంగులేటి చెప్పడం భారాసతో పాటు ఖమ్మం జిల్లా రాజకీయాల్లో హాట్‌ టాపిక్‌గా మారింది. 2019 ఎన్నికల సందర్భంగా అప్పటి సిట్టింగ్‌ ఎంపీ పొంగులేటిని కాదని భారాస తరఫున నామా నాగేశ్వరారవుకు టికెట్ ఇచ్చారు. ఆ ఎన్నికల్లో నామా విజయం సాధించారు. అయితే, అప్పటి నుంచి పొంగులేటికి పార్టీలో సరైన ప్రాధాన్యం దక్కలేదని ఆయన అబిమానులు భావిస్తున్నారు. పొంగులేటి పార్టీ మారుతారని ఇటీవల జోరుగా ప్రచారం జరిగింది. కానీ, దీనిపై ఆయన ఎలాంటి ప్రకటన చేయలేదు. తాజాగా పొంగులేటి తన మనసులో మాటను బయటపెట్టారు. మొత్తం మీద ఎన్నికల ఏడాదిలో ఖమ్మం జిల్లాలో రాజకీయాలు హాట్‌ టాపిక్‌గా మారాయి.

Leave A Reply

Your email address will not be published.

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More