ఒక్కొక్కటిగా నిందితుల పిటిషన్లను తేలుస్తాం
జగన్ కేసుల్లో సీబీఐని ఆదేశించిన హైకోర్టు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి అక్రమాస్తుల వ్యవహారంలో తమపై నమోదైన కేసులను కొట్టేయాలంటూ నిందితులు దాఖలు చేసిన పిటిషన్లపై కేసుల వారీగా జాబితా సమర్పించాలంటూ సీబీఐని హైకోర్టు శుక్రవారం ఆదేశించింది.
జగన్ అక్రమాస్తుల కేసులో హెటిరో, అరబిందో కేసులో నిందితులైన హెటిరో డైరెక్టర్ ఎం.శ్రీనివాసరెడ్డి, హెటిరో కంపెనీలతోపాటు లేపాక్షి నాలెడ్జ్ హబ్‌లో నిందితుడైన శ్రీనివాస బాలాజీ, ఇందూ-గృహ నిర్మాణ మండలి కేసులో నిందితులైన జితేంద్ర వీర్వాణి, ఎంబసీ రియల్టర్స్ దాఖలు చేసిన వేర్వేరు డిశ్ఛార్జి పిటిషన్లపై శుక్రవారం జస్టిస్ షమీమ్ అక్తర్ విచారణ చేపట్టారు. హెటిరో తరఫున సీనియర్ న్యాయవాది టి.నిరంజన్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ ఇండియా సిమెంట్స్ ఎండీ శ్రీనివాసన్‌పై కేసును ఇదే కోర్టు కొట్టివేసిందన్నారు. దీనిపై సీబీఐ సుప్రీంకోర్టును ఆశ్రయించిందని, అక్కడ ఎలాంటి స్టే మంజూరు కాలేదన్నారు. ఇదే తీర్పు అన్ని కేసులకూ వర్తింపజేయవచ్చని, సునీల్ భారతి మిత్తల్ కేసులోనూ సుప్రీంకోర్టు కంపెనీ చర్యలకు ఎండీ బాధ్యుడు కాదని చెప్పారన్నారు. జగతి, జనని ఇన్‌ఫ్రాల్లో రూ.100 నుంచి ఎంత పెట్టుబడి పెట్టినా కేసులు పెట్టారన్నారు. పెట్టుబడి పెట్టడం నేరమంటే ఎలాగని, ఇండియా సిమెంట్స్‌లో కంపెనీలో 26,000 మంది వాటాదారులు పెట్టుబడి పెట్టడానికి అంగీకరించారని, బోర్డు తీర్మానం మేరకే పెట్టుబడులు పెడతారన్నారు. సీఎం కుమారుడి కంపెనీ అయినంత మాత్రాన పెట్టుబడి పెట్టకూడదని ఏమీ లేదని, రేపు మరో సీఎం కుమారుడు కంపెనీ పెట్టినా పెట్టుబడులు పెట్టవచ్చన్నారు. ఈ కేసులపై రాజకీయాల ప్రభావం ఉందని చెప్పారు. హెటిరోను మెడిసిటీగా అభివృద్ధి చేశామని, భూమి కేటాయింపులు జరిపారని, లీజు రద్దు చేయలేదని, భూమిని వెనక్కి తీసుకోలేదన్నారు. 3 వేల మంది ఉపాధి పొందుతున్నారని, వేల కోట్ల రూపాయల విదేశీమారక ద్రవ్యం సమకూరుతోందన్నారు. ప్రస్తుత కొవిడ్ సమయంలో మందుల తయారీ కీలకమని, కేసుల పేరుతో ఇబ్బందులకు గురిచేయడం సరికాదన్నారు.
రాజకీయాలతో సంబంధం లేదు
– సీబీఐ న్యాయవాది సురేందర్
జ గన్ కేసుల్లో రాజకీయాల ప్రభావం ఉందని చెప్పడం సరికాదని సీబీఐ తరఫు న్యాయవాది కె.సురేందర్ తెలిపారు. 11 అభియోగపత్రాలు దాఖలు చేశామని, ప్రతి కేసులోనూ వేర్వేరు అంశాలున్నాయని, ఒకదాంతో మరోదానికి సంబంధం లేదన్నారు. ఇండియా సిమెంట్స్ కేసులో వాస్తవాలు వేరని, ఆ తీర్పు అన్నింటికీ వర్తింపజేయడం సరికాదన్నారు. ఇండియా సిమెంట్స్ కేసులోని అంశాలను ఆధారంగా తీసుకుని ఎండీపై కేసును కొట్టేశారన్నారు. జగన్ కేసుల్లో మొత్తం 103 మంది దాకా నిందితులు ఉన్నారని, కేసును కొట్టేయాలంటూ పలువురు పిటిషన్లు వేశారన్నారు. ఈ దశలో పిటిషనర్ల తరఫు న్యాయవాది జోక్యం చేసుకుంటూ సీబీఐ కేసులతోపాటు ఈడీ కేసులూ ఉన్నాయన్నారు. అవి మరో న్యాయమూర్తి ముందు ఉన్నాయన్నారు. దీనిపై న్యాయమూర్తి జోక్యం చేసుకుంటూ ముందు తనవద్ద ఉన్న సీబీఐ కేసులన్నింటిలో విచారణ పూర్తి చేస్తానని, కేసుల వారీగా జాబితా ఇస్తే ఒక్కో దానిపై విచారణ చేపడతానన్నారు. మూడు వారాల్లో జాబితా సమర్పించాలని సీబీఐని ఆదేశిస్తూ విచారణను వాయిదా వేశారు.