మునుగోడులో ఉప ఎన్నికల కోలాహాలం నెలకొంది. ఎక్కడ చూసినా ఓట్ల పండగ శోభే కనిపిస్తోంది. ఇప్పటికే అన్ని ప్రధాన పార్టీల అభ్యర్థులు ఖరారయ్యారు.
నామినేషన్ల పర్వం మొదలయింది. సమయం ఎక్కువగా లేకపోవడంతో.. అన్ని పార్టీలు ప్రచారాన్ని మరింత ముమ్మరం చేస్తున్నాయి. ముఖ్యంగా టీఆర్ఎస్ పార్టీ పక్కా వ్యూహంతో రంగంలోకి దిగింది. మంత్రులు, ఎమ్మెల్యేలంతా మునుగోడులో దిగారు. ప్రతి ఎంపీటీసీ పరిధిలో ఒక నాయకుడికి చొప్పున ప్రచార బాధ్యతను టీఆర్ఎస్ (TRS) పార్టీ అప్పగించింది. ఇందులో భాగంగా 12 మంది మంత్రులు, 76 మంది ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు ఊరూరా ప్రచారం చేస్తున్నారు. ఐతే అందరితో పాటు సీఎం కేసీఆర్ కూడా లెంకపల్లి ఎంపీటీసీ స్థానం బాధ్యతలను తీసుకున్నారు.
లెంకపల్లి గ్రామానికి టీఆర్ఎస్ ఎన్నికల ఇంచార్జిగా సీఎం కేసీఆర్ బాధ్యతను తీసుకోవడం రాష్ట్రం రాజకీయాల్లో సంచలనంగా మారింది. ఉపఎన్నికల విషయంలో పార్టీ ట్రబుల్ షూటర్ హరీష్ రావుకు కేసీఆర్ బాధత్యలు అప్పజెప్పుతుంటారు. ఒక్కోసారి మంత్రి కేటీఆర్‌ను కూడా పంపిస్తుంటారు. కానీ ఈసారి వారితో పాటు సీఎం కేసీఆర్ కూడా స్వయంగా రంగంలోకి దిగడం, ఒక గ్రామానికి ఎన్నికల ఇంచార్జిగా వస్తుండడంతో మునుగోడు రాజకీయాలను మరింత రసవత్తంగా మారాయి. ఇప్పటికే మంత్రి హరీష్ రావు మర్రిగూడ మండలం బాధ్యతలను తీసుకున్నారు. ఆ మండలంలోని చిన్న గ్రామమైన లెంకపల్లి సీఎం కేసీఆర్ ఎన్నికల ఇంచార్జిగా వస్తున్నారు.త్వరలోనే ఆయన లెంకపల్లి గ్రామంలో పర్యటించనున్నారు.
లెంకలపల్లి ఎంపీటీసీ పరిధిలో 2085 మంది ఓటర్లు ఉన్నారు. 15 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీకి కంచుకోటలా ఈ గ్రామం ఉంది. ఐతే స్థానిక ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరడంతో టీఆర్ఎస్ నాయకులు ఈ గ్రామంలో ఆపరేషన్ ఆకర్ష్ మొదలుపెట్టారు. నెల రోజుల క్రితం కాంగ్రెస్ పార్టీకి చెందిన గ్రామ సర్పంచ్ సతీశ్ 500 మందితో కలిసి సీఎం కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. కాంగ్రెస్ నుంచి గెలిచిన ఎంపీటీసీ మాత్రం బీజేపీలో చేరారు. ప్రస్తుతం ఎంపీటీసీతోపాటు ఐదుగురు వార్డు సభ్యులు బీజేపీలో ఉన్నారు. ఇక త్వరలోనే చండూరులో సీఎం కేసీఆర్ బహిరంగసభ జరగనుంది. ఈ సభకు సీపీఐతోపాటు సీపీఎం నేతలు కూడా హాజరుకానున్నారు.
మునుగోడులో ప్రస్తుతం నామినేషన్ల పర్వం కొనసాగుతోంది. ఈ నెల 14 వరకు నామినేషన్లను స్వీకరిస్తారు. 15న నామినేషన్లను పరిశీలిస్తారు. అక్టోబరు 17 వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉంటుంది. రెండో శనివారం, ఆదివారం రోజుల్లో నామినేషన్లను స్వీకరించరు. నవంబరు 3న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. నవంబరు 6న ఓట్లను లెక్కించి.. ఫలితాన్ని ప్రకటిస్తారు.