అవసరాన్ని అదనుగా చేసుకొని నగల తాకట్టు వ్యాపారి పరార్
• బాధితుల తాకట్టు నగలు, చెల్లించిన డబ్బుతో ఉడాయించిన వైనం
• మొత్తం విలువ సుమారు రూ. 1.35 కోట్లు ఉంటుందని అంచనా
• జగద్గిరిగుట్ట పిఎస్ పరిధిలో చోటు చేసుకున్న సంఘటన
• పోలీసులను ఆశ్రయించిన ఫలితం శూన్యం
• వారం రోజులుగా పిఎస్ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్న బాధితులు
• ఉచిత సలహాలు ఇస్తున్నారంటూ బాధితుల ఆవేదన
జగద్గిరిగుట్ట (న్యూస్ విధాత్రి), ఫిబ్రవరి 4: అవసరానికి ఇంట్లో, ఒంటి మీద ఉన్న బంగారు వెండి నగలను తనకా పెట్టి డబ్బులు తీసుకున్న అమాయకులతో పాటు నూతన నగల కోసం డబ్బులు చెల్లించిన వారిని మోసం చేసి ఓ నగల వ్యాపారి ఉడాయించిన సంఘటన జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఈ మేరకు బాధితులు తెలిపిన వివరాల ప్రకారం… గాజులరామారంలోని చంద్రగిరి నగర్ లో ఓం ప్రకాష్ షిరిడి అనే వ్యక్తి రాందేవ్ పాన్ బ్రోకర్స్ ( నగల తనకా దుకాణం) నిర్వహిస్తున్నాడు.

ఈ నేపథ్యంలో ప్రజలు వారి అవసరాలు నిమిత్తం పలువురు బంగారు, వెండి నగలను సదరు దుకాణంలో తనకా పెట్టి డబ్బులు తీసుకున్నారు. అంతేకాకుండా ఇంకొందరు నూతన బంగారు, వెండి నగల కోసం నిర్వాహకుడికి ముందుగానే డబ్బులు చెల్లించారు. బంగారు వెండి ఆభరణాలు తనకా పెట్టి రుణాన్ని పొందిన వారిలో కొందరు తిరిగి పాక్షికంగా డబ్బులు చెల్లించగా, ఇంకొందరు తమ ఆభరణాలను తిరిగి ఇచ్చేయాలని పూర్తి మొత్తాన్ని సదరు వ్యాపారస్తుడికి చెల్లించారు. దీనిని అదునుగా చేసుకున్న సదరు వ్యాపారి దుకాణాన్ని మూసేసి జనవరి 25వ తేదీన జెండా ఎత్తేసి కుటుంబంతో సహా పరారయ్యాడు. అంతేకాకుండా ఇటీవల దుకాణం పేరును కూడా శ్రీ శివం జువెలర్స్, ఫాన్ బ్రోకర్స్ గా మార్చాడని బాధితులు తెలిపారు. విషయం తెలుసుకున్న బాధితులు జనవరి 28వ తేదీన లబోదిపోమంటూ జగద్గిరిగుట్ట పోలీసులను ఆశ్రయించారు. 28వ తేదీన లిఖితపూర్వకంగా పోలీసులకు ఫిర్యాదు అందించగా వారు ఫిర్యాదును స్వీకరించకపోగా ఉచిత సలహాలు ఇస్తున్నారని, ఏమి చేయాలో తమకు తోచడం లేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు.

అప్పటినుంచి ప్రతిరోజు పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతున్న ఎటువంటి ఫలితం లేదని బాధితులు తెలిపారు. ఇప్పటివరకు అందిన సమాచారం మేరకు సుమారు 130 తులాల బంగారు ఆభరణాలతో పాటు వెండి ఆభరణాలు కూడా ఉన్నాయని వాటి విలువ సుమారు రూ. 1.35 కోట్లు ఉంటుందని వారు తెలిపారు. చంద్రగిరి నగర్ లో నివాసముంటున్న ఓం ప్రకాష్ సిర్వి సోదరుడిని గత 2 రోజుల నుంచి పోలీస్ స్టేషన్ కు తీసుకుని వచ్చి కూర్చోబెట్టి తన అన్న ఆచూకీ తెలపాలని చెబుతున్నారే తప్ప ఆపై ఆచూకీ కోసం ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని బాధితులు వాపోతున్నారు. ఇప్పటికైనా పోలీసులు తమ ఫిర్యాదును తీసుకొని సరైన రీతిలో విచారించి పరారైన వ్యక్తిని పట్టుకొని తమకు న్యాయం చేయాలని బాధితులు కోరుతున్నారు.

• సమాచారం అందిన మేరకు బాధితుల వివరాలు…
గాజులరామారం పీపీ నగర్ కు చెందిన షేక్ రెహనా బేగం (43) సదరు దుకాణంలో 6.5 తులాల బంగారం, 25 తులాల వెండి తనఖా పెట్టి రూ. 2,15,000 రుణాన్ని పొందింది. తిరిగి రూ . 80,000 చెల్లించింది. మిగిలిన డబ్బు తిరిగి ఇచ్చిన అనంతరం ఆభరణాలు తిరిగి ఇస్తానని నమ్మబలికాడు. సుభాష్ చంద్రబోస్ నగర్ కు చెందిన మహ్మద్ బీ (41) తులం బంగారం తనఖా పెట్టి రూ. 30,000 తీసుకొని చెల్లించిన బంగారం ఇవ్వలేదు. బాబా సోలానీ నగర్ బోరబండ కు చెందిన మహమ్మద్ మాలిక్ (42) కూడా తులం బంగారం తనఖా పెట్టి రూ. 30,000 తీసుకొని చెల్లించిన బంగారం ఇవ్వలేదు. మెదక్ జిల్లా గోమారం లోని న్యూ బిసి కాలనీకి చెందిన మహమ్మద్ పాషా (49) నూతన బంగారు గొలుసు కోసం రూ.1,28,000 ముందుగానే చెల్లించింది. సూరారం శివాలయ నగర్ కు చెందిన కమర్ సుల్తానా (51) 5 తులాల నూతన బంగారు ఆభరణాల కోసం రూ.3,80,000 ముందుగానే చెల్లించింది. గాజులరామారం లోని పీపీ నగర్ కు చెందిన సయ్యద్ ఇలియాస్ (30) 15 తులాలు, హబీబా (46) 4 తులాలు, సఫియా మతీన్ (52) తులం బంగారం, సుభాష్ చంద్రబోస్ నా వరకు చెందిన రాజియా బీ (42) మూడు తులాలు, బీదర్ లోని చంబోలికి చెందిన సాలియా బేగం (25) 7 గ్రాములు బంగారాన్ని తాకట్టు పెట్టారు. చంద్రగిరి నగర్ కు చెందిన మెరాజ్ బేగం (43) 7 తులాల బంగారం తాకట్టు పెట్టి అతని వద్ద నుంచి రూ.2,10,000 రుణాన్ని తీసుకొని తిరిగి రూ.78,000 చెల్లించింది. అలాగే పోలీస్ పటేల్ రేఖ (33) తాను తాకట్టు పెట్టిన మూడు గ్రాముల బంగారానికి రూ. 25,000 చెల్లించింది. అంతేకాకుండా పరిసర ప్రాంతాలకు చెందిన భరత్ కుమార్ 10 తులాలు, సాంసంగ్ 5 కులాలు, ఉమాదేవి 1.25 తులాలు, యాదగిరిరావు 6.3 తులాలు, రజిత 3 తులాలు, వి. సురేష్ 5 తులాలు, సూరి 2.5 తులాల బంగారు ఆభరణాలను తాకట్టు పెట్టినట్లుగా తెలిపారు.