మల్లారెడ్డి ఆసుపత్రిలో ఠాగూర్ సీన్ రిపీట్…
• తరచూ వివాదాల్లో నిలుస్తున్న మల్లారెడ్డి ఆసుపత్రి
• వికటిస్తున్న వైద్యం… విరుచుకుపడుతున్న బాధితులు
గాజులరామారం (న్యూస్ విధాత్రి), నవంబర్ 20 : ఆపరేషన్ చేయాలని డబ్బులు గుంజేందుకు శవానికి సైతం చికిత్స చేసే కార్పొరేట్ ఆస్పత్రి ఉదంతాన్ని ప్రముఖ చలనచిత్రం ఠాగూర్ లో మనమందరం చూడనే చూసాం. అచ్చం సుమారు అలాంటి సీనే మరల రిపీట్ అయ్యింది. అది ఏ సినిమాలోనో అనుకోకండి … ఓ ప్రైవేటు ఆసుపత్రి నిర్వహకులు ఠాగూర్ సినిమా సీన్స్ రిపీట్ చేస్తూ చికిత్స పొందుతున్న మహిళ చనిపోయింది అని చెప్పకుండా మభ్యపెట్టిన ఉదాంతంపై సూరారం పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అయ్యింది. మెదడులో నరం తెగిందని… ఆపరేషన్ చేసి ఏకంగా ప్రాణాలే తీసేసారంటూ బాధితులు మల్లారెడ్డి ఆసుపత్రి యాజమాన్యంపై ఫిర్యాదు చేశారు. కేసు నమోదు అయిన వివరాల ప్రకారం..మెదక్ జిల్లా రామాయంపేట్ మండలం సుతార్ పల్లి గ్రామానికి చెందిన నర్సింహులు భార్య రాగి చిన్నవలోల్ల లక్ష్మీ (48) అనారోగ్యం కారణంగా అగస్టు 31వ తేదీన సూరారంలోని మల్లారెడ్డి ఆస్పత్రికి చికిత్స కోసం తీసుకువచ్చారు.
వైద్య పరీక్షలు చేసిన వైద్యుడు డాక్టర్ సుబ్బారెడ్డి (బ్రెయిన్ స్పెషలిస్ట్) ఆమెకు మెదడులో ఒక నరం తెగిపోయిందని, ఆపరేషన్ చేస్తే నయం అవుతుందని చెప్పగా, అందుకు అయ్యే రూ. 25 వేల రూపాయలను చెల్లించారు మహిళా కుటుంబ సభ్యులు. సెప్టెంబర్ 3వ తారీకు ఉదయం 10 గంటల సమయానికి ఆపరేషన్ మొదలుపెట్టి సాయంత్రం 6 గంటల సమయంలో డాక్టర్ సుబ్బారెడ్డి ఆపరేషన్ థియేటర్ నుంచి బయటకు వచ్చి పేషెంట్ బాగానే ఉన్నారని ఆపరేషన్ సక్సెస్ అయిందని తెలిపారు. రెండు రోజులు అబ్జర్వేషన్ లో భాగంగా వెంటిలేటర్ పైనే ఉంచాలని చెప్పాడు. అనంతరం 6వ తారీఖున మరోసారి పేషంట్ కు బ్రెయిన్ స్కాన్ చేసి రిపోర్ట్స్ చూసి డాక్టర్ సుబ్బారెడ్డి మహిళ కుటుంబ సభ్యులను పిలిచి ఆరోగ్యం బాలేదని, కోలుకోవడానికి శరీరం సపోర్ట్ చేయడం లేదని తెలిపారు. కాగా 10వ తారీకు వైద్యులు కుటుంబ సభ్యులను పిలిపించి 9 వ తారీకు ఉదయం చికిత్స పొందుతున్న మహిళలకు స్ట్రోక్ వచ్చిందని పరిస్థితి కష్టమని చెప్పి మహిళను ఇంటికి తీసుకెళ్ళి పోవాల్సిందిగా సూచించారు. రూ .78 వేల రూపాయలు చెల్లించి మహిళలు తీసుకెళ్లాల్సిందిగా చెప్పటంతో, 9వ తారీకు స్ట్రోక్ వస్తే 10వ తారీకు కుటుంబ సభ్యులకు చెప్పటం ఏమిటని కుటుంబ సభ్యులు ప్రశ్నించగా అక్కడ కొంత రసాభాస జరిగింది. వైద్యానికి సంబంధించిన రిపోర్టులు ఏవి ఇవ్వకుండా, కాగితాలపై సంతకం తీసుకొని లక్ష్మీ ని తీసుకెళ్లేందుకు ఆసుపత్రి సిబ్బంది అనుమతించారు. అనంతరం లక్ష్మీని అంబులెన్స్ లో గాంధీకి తీసుకువెళ్లేందుకు ఉపక్రమించారు. కాగా అంబులెన్స్ సిబ్బందితో పరీక్షించమని అడగగా వారు పరీక్షించి మహిళకు పల్స్ లేదని చెప్పడంతో బాధిత కుటుంబ సభ్యులు ఆ మహిళను స్వగ్రామాన్ని తీసుకెళ్లి ఖననం చేశారు.
• సూరారం పోలీసులకు ఫిర్యాదు..
ఆపరేషన్ చేసిన రోజే మహిళ చనిపోవడం ఆపై ఆ మహిళకు వైద్యులు వెంటిలేటర్ మీద ఉంచి చికిత్స చేస్తున్నామని మభ్యపరచడం అంశంపై మృతి చెందిన మహిళ కూతురు అశ్విని సూరారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. 10వ తారీకు ఐసీయూలోకి వెళ్లి చూడగా ఆమె తల్లి ఎలాంటి చలనం లేకుండా ఉన్నదని, చూడడం గాని, మాట్లాడటం కానీ చేయలేదని వాపోయారు. గాంధీకి తరలించే క్రమంలో ఆసుపత్రి సిబ్బంది తమకు ఎటువంటి రిపోర్ట్స్ ఇవ్వకుండా కాగితాలపై సంతకాలు పెట్టించుకుని పంపించారని పేర్కొన్నారు. ఈ విషయంపై మల్లారెడ్డి ఆసుపత్రి యాజమాన్యంపై చర్యలు తీసుకొని తమ కుటుంబానికి తగిన న్యాయం చేయాల్సిందిగా ఆమె పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ విషయంపై సీఐ భరత్ కుమార్ మాట్లాడుతూ బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయడం జరిగిందని, ఎమ్మార్వో.. వైద్యులు సమక్షంలో పూడ్చిన శవానికి పంచనామా, పోస్టుమార్టం చేసిన అనంతరం వచ్చిన నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు.
• గాల్ బ్లాడర్ ఆపరేషన్ వికటించి మరొక మహిళ..
ఇక సూరారం మల్లారెడ్డి ఆసుపత్రి తరచుగా వివాదాలలో నిలుస్తుంది. ఇదే ఆసుపత్రిలో ఈనెల 9వ తారీకు ఓ మహిళకు గాల్ బ్లాడర్ (పిత్తాశయం) ఆపరేషన్ చేయగా ఆమె మరణించింది. ఈ క్రమంలో బాధిత కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున ఆసుపత్రి ముందు ధర్నా నిర్వహించారు. అంతేకాకుండా అక్కడ జరిగిన ఘర్షణలో ఆసుపత్రి అద్దాలు ధ్వంసం అయ్యాయి. అనంతరం యాజమాన్యం దిగివచ్చి బాధితులకు నష్టపరిహారం ఇచ్చేందుకు అంగీకరించారు. ఆస్పత్రి వద్ద జరుగుతున్న రాద్ధాంతాన్ని కవర్ చేసేందుకు వెళ్లిన మీడియా వ్యక్తులపై సైతం మల్లారెడ్డి ఆసుపత్రి సిబ్బంది, బౌన్సర్లు దాడి చేయడంతో ఆసుపత్రి యాజమాన్యంపై సూరారం పోలీస్ స్టేషన్లో కేసు సైతం నమోదయింది.