అనుమతులు లేని శ్రీ చైతన్య పాఠశాలకు మరోమారు షోకాజ్ నోటీసులు ఇచ్చిన ఎంఈఓ
~ అనుమతులు తెచ్చుకోవడానికి 15 రోజులు గడువు అడిగిన నిర్వాహకులు
~ మూడు రోజుల గడువే అని షోకాజ్ నోటీసుల్లో స్పష్టం చేసిన ఎంఈఓ
~పాఠశాల ముందు విద్యార్థుల తల్లిదండ్రులు , బడ్జెట్ పాఠశాలల యాజమాన్యం మరోమారు ధర్నా
~ మండల పరిధిలోని అనుమతులు లేని అన్ని పాఠశాలలను మూసివేయాలని శ్రీ చైతన్య నిర్వాహకులు , ఎం ఎస్ యు ఐ డిమాండ్
కుత్బుల్లాపూర్ (న్యూస్ విధాత్రి), జూన్ 26 : అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న సుచిత్రాలోని శ్రీ చైతన్య పాఠశాలపై విద్యార్థుల తల్లిదండ్రులతో పాటు బడ్జెట్ పాఠశాలల యాజమాన్యాయాలు మరోమారు నిరసన గళాన్ని విప్పారు. పాఠశాల ప్రధాన ద్వారం వద్ద ప్లకార్డులు పట్టుకొని శ్రీ చైతన్య పాఠశాలకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ బుధవారం ధర్నాకు దిగారు. నిబంధనలకు విరుద్ధంగా నిర్వహించే శ్రీ చైతన్య పాఠశాలను వెంటనే మూసి వేయాలని, మండల విద్యాధికారి (ఎంఈఓ) అక్కడికి చేరుకోవాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు అక్కడకు చేరుకున్న ఎంఈఓ వసంత కుమార్, ఎంఎల్ఓ రమేష్ ను చుట్టుముట్టి ఎటువంటి అనుమతులు లేని పాఠశాలలో అడ్మిషన్ లు ఎలా అనుమతిస్తారని, సుమారు 300 మంది విద్యార్థులను శ్రీ చైతన్య పాఠశాల చేర్చుకుందని వారిని నిలదీశారు. అనంతరం బడ్జెట్ పాఠశాలల యాజమాన్యాలు ఎంఈఓ కు వినతిపత్రాన్ని అందజేశారు.
పాఠశాలకు సంబంధించి ఎటువంటి అనుమతులు పొందకుండానే బుధవారం నుంచి తరగతులు నిర్వహిస్తామని విద్యార్థుల తల్లిదండ్రులను శ్రీ చైతన్య యాజమాన్యం ఏ విధంగా పూజా కార్యక్రమానికి ఆహ్వాని స్తుందని మండిపడ్డారు. దీంతో శ్రీ చైతన్య నిర్వాహకులకు ఎంఈఓ షోకాజ్ నోటీసులను జారీ చేశారు. శ్రీ చైతన్య పాఠశాల నిర్వాహకులతో పాటు ఎన్ ఎస్ యు ఐ నాయకులు ఏ విధంగా షోకాజ్ నోటీసులు జారీ చేస్తారని, అలా అయితే మండలంలో అనుమతి లేని, నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్న అన్ని పాఠశాలలను మూసివేయాలన్నారు. పక్కనే ఉన్న సెయింట్ ఆంథోనీస్ పాఠశాల ఏ విధమైన ప్రమాణాలను, నాణ్యతను పాటిస్తుందని కేకలు వేస్తూ, బల్లలు చరిచారు. దీంతో అక్కడ గందరగోల వాతావరణం నెలకొంది. అనంతరం శ్రీ చైతన్య పాఠశాల నిర్వాహకులు అనుమతులు తెచ్చుకునేందుకు 15 రోజుల సమయం కావాలని ఎంఈఓ ను కోరగా, కుదరదని మూడు రోజుల సమయాన్ని ఇచ్చారు. అనంతరం అక్కడ నుంచి పక్కనే ఉన్న సెయింట్ ఆంథోనీస్ పాఠశాలకు వెళ్లారు. సదరు పాఠశాల క్రింద వాణిజ్య సముదాయాలు ఏర్పాటు చేసి వ్యాపారాలు నిర్వహిస్తున్నారని, అది కూడా పాఠశాల నిబంధనలకు విరుద్ధమే కావున ఆ పాఠశాలకు కూడా నోటీసు జారీ చేసి తగిన చర్యలు తీసుకోవాలని ఎన్ ఎస్ యు ఐ డిమాండ్ చేసింది. దీంతో నిబంధనలకు విరుద్ధంగా నిర్వహించే ప్రతి పాఠశాలపై తగిన చర్యలు తప్పకుండా తీసుకుంటామని ఎంఈఓ తెలిపారు.
• అనుమతులు లేకుండా ఆన్ లైన్ లో తరగతులు…
ఎటువంటి అనుమతులు పొందకుండానే పాఠశాల నిర్వహించేందుకు పూనుకున్న శ్రీ చైతన్య పాఠశాల వ్యవహారం వివాదాస్పదం కావడంతో మంగళవారం వరకు అడ్మిషన్లు చేసుకున్న విద్యార్థులకు ఆన్ లైన్ లో తరగతులను నిర్వహించారు. బుధవారం నుంచి ప్రత్యక్ష తరగతులు నిర్వహించేందుకు సన్నద్ధమయ్యారు.
• సీజ్ చేసినా… మూడు మార్లు నోటీసులు జారీ చేసినా… తాళాలు పగలగొట్టి…
ఎటువంటి అనుమతులు లేకుండా అనధికారంగా నిర్వహిస్తున్న సుచిత్రాలోని శ్రీ చైతన్య పాఠశాలకు మండల విద్యాధికారులు మూడు నోటీసులు ఇచ్చి, రెండు పర్యాయాల తాళాలు వేశారు. వారి ఆదేశాలను సైతం భేఖాతరు చేస్తూ తాళాలను పగలగొట్టి పాఠశాల నిర్వహణ కొనసాగిస్తున్నారు. ఇప్పటికే శ్రీ చైతన్య పాఠశాలకు మూడు నోటీసులు జారీ చేశామని, వాటిని కూడా లెక్క చేయకుండా ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారని, పాఠశాల యాజమాన్యంపై క్రిమినల్ కేసులు నమోదు చేసే దిశగా చర్యలు తీసుకుంటామని ఎంఈఓ తెలిపారు.