ఆగ్రోస్ లో స్వల్ప అగ్ని ప్రమాదం… పలు ఫైలు దగ్ధం
~ ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన
~ నాలుగు రోజులైనా గుట్టుగా ఉంచిన యంత్రాంగం
~ కనీసం అగ్ని ప్రమాదం జరిగిన గదిని తెరవని సిబ్బంది
~ బయట నుంచి కిటికీ తలుపును తీసి షార్ట్ సర్క్యూట్ గా నిర్ధారణ
~ తాపీగా ఉన్నతాధికారుల పరిశీలన… పోలీసులకు ఫిర్యాదు
కుత్బుల్లాపూర్ (న్యూస్ విధాత్రి), జూన్ 20 : అది ఓ ప్రభుత్వ కార్యాలయం.. ఆ కార్యాలయంలో అగ్ని ప్రమాదం జరిగి పలు ఫైళ్లు, పుస్తకాలతో పాటు ఇతరత్రా కాగితాలు బుగ్గిపాలై నాలుగు రోజులు గడుస్తున్న అధికారులు గుట్టుగా ఉంచారు. అంతేకాకుండా ప్రమాదం జరిగిన గదిని సైతం నాలుగు రోజులుగా తెరిచి ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం కూడా చేయకపోవడంతో యంత్రాంగం తీరుపై పలు విమర్శలకు తావిస్తుంది.
ఈ సంఘటన జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో ఆలస్యంగా వెలుగు చూసింది. వివరాల ప్రకారం… కుత్బుల్లాపూర్ సర్కిల్ పరిధి చింతల్ లో ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు చెందిన ఆగ్రోస్ ప్రాంతీయ కార్యాలయం ఉంది. ఈ కార్యాలయంలో గత సోమవారం అగ్నిప్రమాదం సంభవించి ఒక అల్మారీలో ఉన్న పలు ఫైలు, పుస్తకాలు, ఇతరత్రా కాగితాలు దగ్ధమయ్యాయి. ఇటీవల కార్యాలయానికి వరస సెలవుల (ఆది, సోమవారం) అనంతరం మంగళవారం ఉదయం కార్యాలయానికి వచ్చిన సిబ్బంది అగ్ని ప్రమాద సంఘటనను గుర్తించారు. సంఘటన గుర్తించిన అధికారులు, సిబ్బంది కనీసం సదరు గదిని తెరిచి ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నం చేయకపోగా వెలుపల నుంచి ఉన్న ఓ కిటికీ తలుపు తొలగించి ప్రమాదం విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్లనే జరిగిందని నాలుగు రోజుల అనంతరం నిర్ధారణకు రావడం గమనార్హం.
– ప్రమాదవశాత్తా… ఎవరి పనైనానా…?
ఆగ్రోస్ కార్యాలయ యంత్రాంగం విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్లనే ప్రమాదం జరిగిందని చెపుతున్నారు. కానీ.. ప్రమాదం జరిగిన గది అకౌంట్ విభాగానికి చెందింది కావడం, గదిని తెరవకుండా బయటి వైపు నుంచి కిటికీ తలుపుని తొలగించి మాత్రమే పరిశీలించి నిర్ధారణకు రావడం పలు అనుమానాలకు దారితీస్తుంది. అంతేకాకుండా నిత్యం కాపలా ఉండే వాచ్ మెన్ అదే రోజు సెలవు పెట్టడం, అదే రోజు అగ్ని ప్రమాదం జరగడం విమర్శలకు మరింత బలాన్ని చేకూరుస్తుంది. దీంతో నిజంగానే ప్రమాదవశాత్తు షార్ట్ సర్క్యూట్ జరిగిందా… లేక కావాలనే సదరు ఫైళ్ళకు ఎవరైనా నిప్పు పెట్టారా…? అనే అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఆగ్రోస్ అధికారులు మాత్రం దగ్ధమైన కాగితాల్లో ఎన్ ఎఫ్ ఎం ఎస్ దరఖాస్తు కాగితాలు మాత్రమే ఉన్నాయని చెప్పుతున్నారు.
– తాపీగా ఉన్నతాధికారుల పరిశీలన… పోలీసులకు ఫిర్యాదు..
సంఘటన జరిగి నాలుగు రోజులు గడుస్తున్న కార్యాలయ యంత్రాంగం సదరు గదిని తెరవలేదు అనేది పక్కన పెడితే.. కనీసం ఉన్నతాధికారులు సైతం సంఘటనా స్థలాన్ని నాలుగు రోజులగా పరిశీలించలేదు. నాలుగు రోజుల అనంతరం గురువారం సాయంత్రం ఆగ్రోస్ మేనేజర్ మధుసూదన్ వచ్చి పరిశీలించడం విశేషం. అయితే కార్యాలయ సిబ్బంది సదరు విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్ళారా… లేదా…? అనే ప్రశ్న కూడా ఉత్పన్నమవుతుంది. అంతేకాకుండా సంఘటన సోమవారం చోటు చేసుకుంటే జీడిమెట్ల పోలీసులకు గురువారం ఫిర్యాదు చేయడం మరో విశేషం.
– పోలీసుల రావడం లేదు… ఫిర్యాదు చేసింది గురువారమే…
మంగళవారం ఉదయం ప్రమాదాన్ని గుర్తించిన వెంటనే జీడిమెట్ల పోలీసులకు తెలియజేశామని, అప్పటి నుంచి ప్రతిరోజు పోలీస్ స్టేషన్ కు వెళ్తున్న పోలీసులు రావడంలేదని ఆగ్రోస్ యంత్రాంగం చెబుతున్న మాట. ఇదే విషయంపై జీడిమెట్ల సీఐ శ్రీనివాసరావును వివరణ కోరగా తమకు గురువారం సాయంత్రం ఫిర్యాదు అందిందని, కేసు నమోదు చేసి విచారణ చేపడుతున్నామన్నారు.