మాకు ఏమీ తెలియదు… మేమేమీ చూడలేదు, వినలేదు…

• సర్కిల్ కార్యాలయంలో ఓ అధికారిపై దాడి విషయంలో అధికారులు, సిబ్బంది తీరు
• ఓ సెక్షన్ అధికారిని ఓ మహిళ చెప్పుతో కొట్టిందని చక్కర్లు కొడుతున్న వార్త
• తనను మోసం చేశాడని పట్టణ ప్రణాళిక విభాగంలో రభస
• ఇంత జరిగిన ఏమీ జరగలేదంటూ సమాధానాలు
• వాస్తవమా…? వదంతులా…?తేల్చాల్సిన ఉన్నతాధికారులు
కుత్బుల్లాపూర్ (న్యూస్ విధాత్రి), సెప్టెంబర్ 20 :  అది కుత్బుల్లాపూర్ సర్కిల్ కార్యాలయ భవనంలోని మొదటి అంతస్తులో ఉండే గాజులరామారం సర్కిల్ పట్టణ ప్రణాళిక (టౌన్ ప్లానింగ్) విభాగం. ఆ విభాగం ఎల్లప్పుడూ నిర్మాణ అనుమతులు, నిర్మాణ సంబంధిత ఇతరత్రా వ్యవహారాల కోసం వచ్చే ప్రజలు, సిబ్బందితో హడావిడిగా ఉంటుంది. ఈ మొదటి అంతస్తులో పట్టణ ప్రణాళిక విభాగంతో పాటు రెవెన్యూ విభాగం కూడా ఉంది అది కూడా ఎల్లప్పుడూ వినియోగదారులు, అధికారులు, సిబ్బందితో బిజీ బిజీగా ఉంటుంది. దీంతో అక్కడ ఏ చిన్న సంఘటన జరిగినా క్షణాల్లో కార్యాలయం అంతా విస్తరిస్తుంది. కానీ శుక్రవారం మధ్యాహ్నం జరిగిన ఓ సంఘటన ఎవరు చూడలేదు అనడం… ఎవరికీ తెలియదు అనడం విడ్డూరంగా ఉంది.
• వదంతులా….వాస్తవమా….?
శుక్రవారం మధ్యాహ్నం సుమారు 12:30 గంటలకు ఓ మహిళ గాజులరామారం పట్టణ ప్రణాళిక విభాగానికి వచ్చి సెక్షన్ అధికారిగా విధులు నిర్వహిస్తున్న జెకే. నరేష్ ను ఉద్దేశించి తనను సదరు అధికారి మోసం చేశాడని గొడవపడి సుమారు 10 నిమిషాల పాటు గందరగోళాన్ని సృష్టించిందని సమాచారం. అంతేకాకుండా సదరు మహిళ నరేష్ ను చెప్పుతో కొట్టిందని, అనంతరం ఆ మహిళను నరేష్ తన మోటార్ సైకిల్ పై ఎక్కించుకొని బయటికి తీసుకువెళ్లాడనే సమాచారం కూడా చక్కర్లు కొడుతుంది. ఇదే విషయంపై మొదటి అంతస్తులో ఉన్న పట్టణ ప్రణాళిక, రెవెన్యూ విభాగాల అధికారులను, సిబ్బందిని అడిగిన తామేమీ చూడలేదని, తమకేమీ తెలియదని చెప్పడం అనుమానాలకు తావిస్తోంది. నిత్యం పట్టణ ప్రణాళిక విభాగంలోనే ఉండే అటెండర్, చైన్ మెన్ లు, న్యాక్ ఇంజనీర్లు, ఆపరేటర్లు, ఇతరత్రా సిబ్బంది కూడా తమకేమీ తెలియదు అన్నట్లు వ్యవహరించడం విడ్డూరంగా ఉంది. ఉదయం నుంచి ఎవరూ లేకపోయినా భోజన సమయం కావడంతో అందరూ సెక్షన్ లోనే సామూహికంగా ప్రతిరోజు భోజనం చేయడం పరిపాటి. సుమారు ఆ సమయంలో జరిగిన సంఘటననే తాము గుర్తించలేదనడం పలు అనుమానాలకు తావిస్తోంది. అంతేకాకుండా ఈ విషయంపై సర్కిల్ కార్యాలయ ఉన్నతాధికారులకు కూడా సమాచారం లేకపోవడం ఆశ్చర్యం. సెక్షన్ అధికారి నరేష్ పై దాడి విషయంలో నిజానిజాలను ఉన్నతాధికారులు పరిశీలించి వాస్తవమా… వదంతులా…అనే విషయాన్ని తేల్చాల్సి ఉంది.
• సీసీ కెమెరాలు ఉండవు… ఉన్నా పని చేయవు…
సర్కిల్ కార్యాలయంలో కేవలం ఉప కమిషనర్ గదిలో తప్ప మరే విభాగంలో కూడా సీసీ కెమెరాలు ఉండవు ఒకవేళ ఉన్న అవి పని చేయవు. గతంలో పలుమార్లు రాత్రి వేళల్లో సర్కిల్ కార్యాలయంలో దొంగలు పడి కంప్యూటర్లు, ప్రింటర్, స్కానర్ తో పాటు పలు సామాగ్రిని దొంగలించిన సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలనే కనీస ఆలోచన కూడా అధికారులకు కలగలేదు. కనీసం ప్రస్తుతం పని చేయకుండా ఉన్న సీసీ కెమెరాలు సైతం బాగు చేయించాలనే ఉద్దేశం కూడా వారికి లేకపోవడం గమనార్హం. శుక్రవారం జరిగిన సంఘటనలతో పాటు సర్కిల్ కార్యాలయాల్లో పలు సందర్భాల్లో ప్రజల పనులపై అధికారులు సిబ్బంది స్పందించినప్పుడు అరుపులు, కేకలుతో పాటు గొడవలు జరుగుతూనే ఉంటాయి అటువంటి సందర్భంలో సీసీ కెమెరాలు కీలక పాత్ర పోషిస్తాయి. వాటి సిసి ఫుటేజ్ ఆధారంగా బాధ్యులైన వారిపై చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. మరి ఇప్పటికైనా సంబంధిత అధికారులు సీసీ కెమెరాలను పునరుద్ధరిస్తారో… లేదో వేచి చూడాల్సిందే.

 

Leave A Reply

Your email address will not be published.

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More