కూలిన సెల్లార్ గోడ… ఇరుక్కున్న కార్మికుడు
~ అర్ధనాథాలు పెడుతూ అల్లడిల్లుతున్న కార్మికుడు
కుత్బుల్లాపూర్ (న్యూస్ విధాత్రి), జూన్ 3 : ఓ పాత అపార్ట్మెంట్ సెల్లార్ గోడ కూలి ఓ కార్మికుడు గోడ క్రింద ఇరుక్కొని విపరీతంగా ఆర్తనాదాలు పెడుతున్నాడు. ఈ సంఘటన కుత్బుల్లాపూర్ సర్కిల్ జీడిమెట్ల డివిజన్ పరిధిలోని శ్రీ నిలయ ఎంక్లేవ్ లోని సాయిరాం బృందావన్ అపార్ట్మెంట్ లో సోమవారం చోటుచేసుకుంది. ఉదయం సుమారు 11:45 గంటలకు 5 మంది కార్మికులు సదరు గోడ పక్కనే మరో గోడ నిర్మించేందుకు తవ్వుతున్న నేపథ్యంలో సెల్లార్ గోడ ఒకసారి గా కుప్ప కూలింది. దీంతో అక్కడే పనిచేస్తున్న మహబూబాబాద్ జిల్లా, లోని పూర్వి మండలం, నేరేడు గ్రామంలోని కాకుల బొడ్ తండ కు చెందిన బానోత్ రెడ్డి (35) కాళ్లపై గోడ పడి ఇరుక్కుపోయాడు. అతనితో పాటు ఉన్న నలుగురు తోటి కార్మికులు గోడ కూలే విషయాన్ని గమనించి అప్రమత్తమై తప్పించుకొని బానోత్ రెడ్డిని లాగేందుకు ప్రయత్నించిన ఫలితం లేకపోయింది. దీంతో సమాచారం అందుకున్న జిహెచ్ఎంసి, డిఆర్ఎఫ్, ఎన్ డి ఆర్ ఎఫ్, అగ్నిమాపక శాఖ అధికారులు, సిబ్బంది అక్కడకు చేరుకొని సహాయక చర్యలు చేపడుతున్నారు. ఉదయం 11:45 గంటలకు సంఘటన చోటుచేసుకున్న సాయంత్రం 5:30 గంటల వరకు భానోత్ రెడ్డి శిధిలాల కిందనే ఉండడంతో తీవ్ర వేదనతో హాహాకారాలు చేస్తుండడం అక్కడ అందరిని కలచివేసింది. బాధితున్ని బయటికి తీసేందుకు ఓ పక్క సహాయక చర్యలు చేస్తుండగానే 108 వైద్య బృందం అక్కడే బాధితుడికి సెలైన్, ఆక్సిజన్ పెట్టి చికిత్సను అందిస్తున్నారు. బాధితుడి కాళ్లు కూలిన గోడ శిధిలాల క్రిందే ఉండిపోవడంతో అతనిని బయటికి తీసే వరకు కాళ్ల పరిస్థితి ఏమిటనే విషయం చెప్పలేకుండా ఉంది.