బీఆర్ఎస్ కు మైనంపల్లి రాజీనామా
- ఎవరికి లొంగే ప్రసక్తే లేదు..
- ఆదరించిన ప్రజలకు అండగా నిలుస్తా.
- త్వరలో కార్యాచరణ ప్రకటిస్తా
మల్కాజిగిరి (న్యూస్ విధాత్రి), సెప్టెంబర్ 22: రానున్న ఎన్నికల్లో మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు దారెటో…? అని ఆసక్తికరంగా ఎదురుచూస్తున్న పలువురి ప్రశ్నలకు సమాధానం దొరికినట్లే అనిపిస్తుంది. ఆయన బీఆర్ఎస్ పార్టీలోనే ఉంటారా… లేక వీడతరా… అనే సందేహానికి తెరపడింది. వీటన్నిటికీ సమాధానంగా మైనంపల్లి శుక్రవారం ఓ వీడియోను విడుదల చేశారు. సదరు వీడియోలో తాను బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు స్పష్టం చేశారు. మల్కాజిగిరి ప్రజల, కార్యకర్తల, రాష్ట్రంలో నలుమూలుగా ఉన్న ఆయన శ్రేయోభిలాషుల కోరిక మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా వివరించారు. ఇప్పటివరకు తనపై ఆదరణ చూపించి అండగా నిలిచిన ప్రజానీకానికి, శ్రేయోభిలాషులకు తన కంఠంలో ప్రాణం ఉన్నంతవరకు ఎల్లవేళలా అండగా నిలుస్తానని తెలిపారు. తానెప్పుడు ప్రజాభిస్టం మేరకే నడుచుకుంటానని ఎవరికీ లొంగే ప్రసక్తే లేదన్నారు. కాలయాపన చేయకుండా త్వరలోనే ఏ పార్టీలో చేరేది స్పష్టం చేస్తానని తెలిపారు.
కుమారుడికి టికెట్ ఇవ్వనందుకే…
రానున్న ఎన్నికల్లో తనతో పాటు తన కుమారుడు మైనంపల్లి రోహిత్ కు కూడా బీఆర్ఎస్ నుంచి మెదక్ టికెట్ ఆశించి ఆయన భంగపడ్డారు. దీంతో బీఆర్ఎస్ లోని ప్రముఖ నాయకుడైన మంత్రి హరీష్ రావు పై తిరుమలలో సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి సన్నిధిలో తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. అప్పటినుంచి ఆయన బీఆర్ఎస్ లో ఉంటారా… లేదా అనే సందేహం అటు రాజకీయ వర్గాల్లో ఇటు ప్రజలందరిలో నెలకొంది. ఎట్టకేలకు శుక్రవారం సందేహాలు అన్నిటిని పటాపంచలు చేసి తాను బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు స్పష్టం చేశారు