*ఉత్తర తెలంగాణకు ఆరెంజ్ అలర్ట్.. ఈశాన్య గాలులతో పెరిగిన చలి తీవ్రత*
ఈశాన్య గాలుల ప్రభావంతో తెలంగాణపై చలిపంజా విసురుతున్నది.
రాబోయే రెండు రోజుల్లో రాష్ట్రంలో అత్యంత కనిష్ఠానికి ఉష్ణోగ్రతలు.
మెదక్ ఈశాన్య గాలుల ప్రభావంతో తెలంగాణపై చలిపంజా విసురుతున్నది. రాష్ట్రంలో ఎప్పుడూ లేనంతగా ఉష్ణోగ్రతలు కనిష్ఠానికి పడిపోయాయి. పగటిపూట కూడా చలి వణికిస్తున్నది. మధ్యప్రదేశ్,విదర్భ ప్రాంతాల నుంచి వీస్తున్న చలిగాలుల ప్రభావం వల్ల రాబోయే రెండు రోజుల్లో ఉత్తర తెలంగాణ జిల్లాల్లో అత్యంత కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు అవుతాయని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది.రెండు రోజులపాటు చలిగాలుల తీవ్రత కొనసాగుతుందని, వారం తర్వాత మళ్లీ చలి తీవ్రత పెరిగే అవకాశం ఉందని చెప్పారు.ఒక్కసారిగా పెరిగిన చలితో గ్రేటర్ ప్రజలు వణికిపోయారు.రాత్రి నుంచి ఉదయం 8 గంటల వరకు కూడా పొగమంచు కప్పేసింది. తొలిసారిగా గ్రేటర్లో రికార్డు స్థాయిలో రాత్రి ఉష్ణోగ్రతలు 12.8 డిగ్రీల కనిష్ఠానికి పడిపోయాయి.గరిష్ఠ ఉష్ణోగ్రత 28.3 డిగ్రీలుగా నమోదైందని వాతావరణ శాఖ వెల్లడించింది.రాబోయే మూడు రోజుల వరకు గ్రేటర్‌కు ఎల్లో హెచ్చరికలు జారీచేసింది. రాష్ట్రంలోని ఆదిలాబాద్,కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల,నిర్మల్, కరీంనగర్,పెద్దపల్లి, జగిత్యాల,రాజన్న సిరిసిల్ల,కామారెడ్డి, నిజామాబాద్,మెదక్ జిల్లాలకు వాతావరణ కేంద్రం ఆరెంజ్ అలర్ట్ జారీచేసింది.గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో గరిష్ఠంగా 27 డిగ్రీలు, కనిష్ఠంగా 12.8 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదైనట్టు వెల్లడించింది. ఆదిలాబాద్‌లో 7.2 డిగ్రీలు, భద్రాచలం 14, దుండిగల్ 14, హకీంపేట 13.8, హనుమకొండ 12, హైదరాబాద్ 12.8, ఖమ్మం 12.6, మహబూబ్‌నగర్ 16.2, మెదక్ 11,నల్లగొండ 16.4,మెదక్ 14.3, రామగుండంలో 9.6 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదైనట్టు తెలిపింది.
*సిర్పూర్(యు)లో రాష్ట్రంలోనే అత్యల్పం*
కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో ఒక్కసారిగా ఉష్ణోగ్రతలు పడిపోయాయి. రాష్ట్రంలోనే అత్యల్పంగా సిర్పూర్(యు)లో 4.7 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది.తిర్యాణిలో 6.4 డిగ్రీలకు పడిపోయింది. ఉదయం తొమ్మిది గంటల దాకా పొగమంచు వీడలేదు. వాహనదారులు రాకపోకలు సాగించేందుకు ఇబ్బంది పడ్డారు.