రైతుబంధు నగదు పడినా.ఇవ్వని బ్యాంకు అధికారులు లబోదిబోమంటున్న రైతులు.

తెలంగాణ ప్రభుత్వం రైతులను ఆర్థికంగా ఆదుకునేందుకు రైతుబంధు పథకాన్ని అమలు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే రైతుబంధు సాయాన్ని గత నెల 28వ తేదీ నుంచి రైతుల ఖాతాల్లో నగదు జమ చేయడం ప్రారంభించింది ప్రభుత్వం. ప్రస్తుతం యాసంగిలో పంటల సాగుకు రాష్ట్ర ప్రభుత్వం పెట్టుబడి సాయం కింద రైతుబంధు పథకంలో జమచేస్తున్న డబ్బును బ్యాంకులు నిలిపివేస్తున్నాయి. ఎందుకంటే సదరు రైతు బ్యాంకుకు బాకీ ఉండటంతో ఆ మొత్తాన్ని బ్యాంకు బాకీ కింద పట్టేసుకుంటున్నాయి. అయితే గత పది రోజుల్లో 54.70 లక్షల మంది రైతుల బ్యాంకు ఖాతాల్లో రూ.4,327.93 కోట్లను వ్యవసాయశాఖ జమచేసింది. కానీ రైతు పంట రుణం పాత బాకీ ఉన్నందున ఖాతాలో పడిన రైతుబంధు నగదును బ్యాంకులోంచి తీయకుండా నిలిపివేస్తున్నామని, బాకీ ఉన్న డబ్బులు చెల్లిస్తేనే విడుదల చేస్తామని కొన్ని బ్యాంకులు తేల్చి చెబుతున్నాయి.
ఇవే కాకుండా గత వానాకాలంలో పండించిన వరిధాన్యాన్ని రైతులు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో విక్రయిస్తే ఆ డబ్బులు కూడా రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ వారి బ్యాంకు అకౌంట్లో జమచేస్తోంది. ఆ డబ్బు కూడా పాత బాకీ ఖాతాలకే బ్యాంకులు మళ్లిస్తున్నాయట. ఇలా పాత బాకీ ఉన్నందున ఖాతాలో పడిన రైతుబంధు పథకం డబ్బులను నిలిపివేస్తుండటంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. అయితే బ్యాంకులకు పాత బకాయీలు ఉన్నా.. రైతుబంధు పథకం డబ్బులు నిలిపివేయవద్దని, రైతులకు ఇచ్చేయాలని తెలంగాణ వ్యవసాయ శాఖ బ్యాంకులను ఆదేశించినా బ్యాంకు అధికారులు పట్టించుకోవడం లేదని రైతులు ఆవేదన చెబుతున్నారు.
రాష్ట్రంలో చాలా మంది రైతుబంధు బ్యాంకులోనే నిలిపివేత
ఇలా రాష్ట్రంలో చాలా మంది రైతుల రైతుబంధు సాయాన్ని బ్యాంకులోనే ఉండిపోయాయని, బ్యాంకుకు ఉన్న పాత బాకీ ఉన్నందున ఆ డబ్బులు విత్‌డ్రా చేయకుండా బ్యాంకులు నిలిపివేస్తున్నాయని చాలా మంది రైతులు వాపోతున్నారు. పాత బాకీతో ముడిపెట్టకుండా రైతులు రైతుబంధు నగదును విత్‌డ్రా చేసుకునేందుకు అవకాశం ఇవ్వాలని వ్యవసాయ శాఖ ఆదేశించినా బ్యాంకులు పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. ఇలా పాతబాకీ ఉన్నందున డబ్బులు నిలిపివేస్తే పంట సాగుకు ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తుందని రైతులు వాపోతున్నారు. తాము రిజర్వుబ్యాంకు నిబంధనలనే పాటిస్తామని, పాతబాకీలు కట్టనివారి పొదుపు ఖాతాల్లో ఉన్న సొమ్మును విడుదల చేయకుండా నిలిపివేసే అధికారం తమకు ఉందని బ్యాంకు అధికారులు చెబుతున్నట్లు రైతులు పేర్కొంటున్నారు.

విచారణ చేపట్టి అధికారులపై చర్యలు తీసుకుంటాం: మంత్రి హరీష్‌రావు

ఇలాంటి అంశాలపై రైతులకు ఇబ్బందులు కలుగకుండా మంత్రి హరీష్‌రావు స్పందించారు. రాష్ట్ర ప్రభుత్వము పంట పెట్టుబడి సహాయం కింద రైతులకు జమ చేసిన డబ్బును బ్యాంకులో పాత బకాయిలు కింద జమ చేసుకోవడానికి సంబంధించి విచారణ చేపట్టి వెంటనే సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని ఎస్ఎల్బీసీ (స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ కమిటీ) సెక్రెటరీని రాష్ట్ర మంత్రి హరీష్‌రావు ఆదేశించారు. భవిష్యత్తులోభవిష్యత్తులో ఇట్లాంటి సంఘటన చోటు చేసుకోకుండా అన్ని బ్యాంకులకు ఎస్ఎల్బీసీ మార్గదర్శకాల ప్రకారం రైతుబంధు పంట పెట్టుబడి సహాయాన్ని పాత బకాయిల కింద జమచేయకుండా ప్రభుత్వ మార్గదర్శకాలను పాటించవలసిందిగా మంత్రి ఆదేశించారు.

బ్యాంకులో రైతుల నగదు నిలిచిపోకుండా చూస్తాం: నిరంజన్‌రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి

రాష్ట్రంలో ఇప్పటికే 54 లక్షల మందికిపైగా రైతుల ఖాతాల్లో రైతుబంధు పథకం నగదు జమ చేశామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి అన్నారు. ఏ బ్యాంకులోనైనా ఖాతాలను నిలిపివేస్తే రైతులు వెంటనే సమీపంలో ఉన్న వ్యవసాయ శాఖ అధికారికి ఫిర్యాదు చేయాలని సూచించారు. బ్యాంకుకు వెళ్లి అక్కడి సిబ్బందితో మాట్లాడి రైతుల ఖాతా నుంచి డబ్బులు విత్‌డ్రా చేసే ఏర్పాట్లు చేసేలా ఆదేశాలు ఇస్తామన్నారు. అయితే యాసంగి వేళ రైతులకు పెట్టుబడి సాయం అందించాలనే సదాశయంతో రాష్ట్ర ప్రభుత్వం వ్యయప్రయాలసకోర్చి రైతుబంధు కింద రూ.7 వేల కోట్లను దశలవారీగా రైతుల ఖాతాల్లో జమచేస్తోందని అన్నారు.

Leave A Reply

Your email address will not be published.

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More