విద్యార్థుల తల్లిదండ్రుల రక్తాన్ని పీలుస్తున్న కార్పోరేట్, ప్రైవేట్ పాఠశాలల పై తగిన చర్యలు తీసుకోవాలి.- ఏబీవీపీ
కుత్బుల్లాపూర్ (న్యూస్ విధాత్రి), జూన్ 20 : అధిక ఫీజులు, స్టేషనరీ పేరిట విద్యార్థుల తల్లిదండ్రుల రక్తాన్ని పీలుస్తున్న కార్పోరేట్, ప్రైవేట్ పాఠశాలల పై తగిన చర్యలు తీసుకొని, ఫీజు నియంత్రణ చట్టాన్ని అమలులోకి తీసుకురావాలని ఏబీవీపీ గురువారం డిమాండ్ చేసింది. చింతల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మేడ్చల్ జిల్లా కన్వీనర్ నగేష్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో ప్రారంభమైన ఇప్పటివరకు విద్యార్థులకు పుస్తకాలు, పాఠశాల యూనిఫాంలు అందించకపోవడం, ప్రభుత్వం ఏర్పడి ఆరు మాసాలు గడుస్తున్న విద్యాశాఖ మంత్రిని నియమించకపోవడం సిగ్గుచేటు అన్నారు. అక్రమంగా లక్షలలో ఫీజులు వసూలు చేస్తూ, నిబంధనలకు విరుద్ధంగా పుస్తకాలు, యూనిఫాంలను విక్రయిస్తున్న ప్రైవేటు, కార్పోరేట్ పాఠశాలల యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అనుమతులు లేని, నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్న పాఠశాలలను వెంటనే తొలగించాలన్నారు. మెగా డీఎస్సీ ద్వారా 24 వేలకు పైగా ఖాళీగా ఉన్న టీచర్ పోస్టులు అన్ని భర్తీ చేసి ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత లేకుండా చూడాలని, వెంటనే డి ఈ ఓ, ఎం ఈ ఓ అధికారులను నియమించాలన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం లో జరుగుతున్న అవకతవకలపై విచారణ
జరిపి, నాణ్యతలేని ఆహారాన్ని అందిస్తున్న అధికారుల పైన చర్యలు తీసుకొని, విద్యార్థులకు నాణ్యమైన ఆహారాన్ని అందించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో అటెండర్లు, ఆయాలను నియమించాలన్నారు. విద్యా హక్కు చట్టం ప్రకారం ప్రైవేటు పాఠశాలల్లో పేద విద్యార్థులకు 25 శాతం సీట్లు కేటాయించాలని తెలిపారు. ఈ సమావేశంలో ఏబీవీపీ రాష్ట్ర కార్య సమితి సభ్యురాలు మనీషా,మేడ్చల్ జిల్లా మహిళ కన్వీనర్ భార్గవి, కార్యకర్తలు పాల్గొన్నారు.