80 వేలకు 15 రోజుల చిన్నారి
హైదరాబాద్, ఫిబ్రవరి 9: పుట్టి.. 15 రోజులైనా అమ్మపాలు తాగి.. ఆదమరిచి నిదురించిందో లేదో ఆ ఆడపిల్ల. నిత్యావసర వస్తువులను అమ్మేసినట్లుగా రూ.80 వేలకు ఆడ పసిగుడ్డును అమ్మేశారు తల్లిదండ్రులు. ఆడపిల్లగా పుట్టడమే నేను చేసిన తప్పా అమ్మా ? అని నోరు తెరచి అడగలేదు కదా పాపం. కన్నతల్లే తనను అంగట్లో సరుకుగా మరొకరికి అమ్మేసిందని తెలుసుకోలేదు కదా. హైదరాబాద్ లోని వనస్థలిపురంలో జరిగిందీ ఘటన. 15 రోజుల ఆడపిల్లను రూ. 80 వేలకు అమ్మేశారు ఆ కర్కశ తల్లిదండ్రులు. దుర్గా ప్రియ – శ్రీనివాస్ దంపతులకు రెండు కాన్పుల్లో ఆడపిల్లలు పుట్టగా.. మూడో కాన్పులో అయినా మగపిల్లాడు పుడతాడు అనుకున్నారు.కానీ మళ్లీ ఆడపిల్లే పుట్టిందని అమ్మేశారు. జనవరి 21వ తేదీన దుర్గాప్రియకు ఆడపిల్ల జన్మించింది.
మనుమరాలిని చూద్దామని ఆశగా వచ్చిన అమ్మమ్మకు బిడ్డను అమ్మేశారని తెలిసింది. ఆమె ఒక్కసారిగా షాక్ కు గురైంది. కన్నబిడ్డను అమ్మేయటానికి మనస్సెలా ఒప్పిందే? కన్నదానివా? కసాయిదానివా? పెంచలేకపోతే బిడ్డను ఎందుకు కన్నారు? అని ఆగ్రహంగా ప్రశ్నించింది. ఈ విషయం కాస్తా పోలీసులకు తెలియటంతో కన్నవారితో పాటు వారికి సహకరించినవారిని కూడా అదుపులోకి తీసుకున్నారు. ఆశావర్కర్ బాషమ్మ సహాయంతో బాలానగర్ కు చెందిన కవిత అనే మహిళకు పసిబిడ్డను అమ్మేశామని తల్లిదండ్రులు తెలిపారు. దాంతో కవిత నుంచి పోలీసులు బిడ్డను స్వాధీనం చేసుకుని, చైల్డ్ ప్రొటెక్షన్ కమిటీకి అప్పగించారు. అనంతరం నిందితులైన ఐదుగురిని అరెస్ట్ చేశారు.