ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ ఏర్పాటు నా కల: సిజెఐ
హైదరాబాద్: ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్, మీడియేషన్ సెంటర్ ఏర్పాటు చేయడం నా కల అని, ఇందుకు సహకరించిన తెలంగాణ సిఎం కెసిఆర్, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి కుమారి హిమా కోహ్లీకి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి.రమణ అన్నారు.
బంజారాహిల్స్ లోని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి కుమారి హిమా కోహ్లీ నివాసంలో జరిగిన ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్, మీడియేషన్ సెంటర్ ట్రస్టు డీడ్ రిజిస్ట్రేషన్ కు రమణ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ సెంటర్ ఏర్పాటుకు తెలంగాణ ప్రభుత్వం చొరవ చూపించిందన్నారు. పెట్టుబడిదారులు వివాదం లేదని వాతావరణం కోరుకుంటారని, త్వరగా వివాదాలు పరిష్కారం కావాలని కోరుకుంటారన్నారు. ప్రస్తుతం ఆర్బిట్రేషన్ కోసం దుబాయ్, సింగపూర్ వెళ్లాల్సి వస్తున్నది, వ్యయ ప్రయాసలతో కూడుకున్నదన్నారు. సెంటర్ ఏర్పాటు కోసం నేను మూడు నెలల క్రితం ప్రతిపాదించగా సిఎం కెసిఆర్ వెంటనే స్పందించారన్నారు. నా కల సాకారానికి మూడు నెలల్లోనే అడుగులు పడతాయని ఊహించలేదన్నారు. తెలంగాణ ముద్దుబిడ్డ, మాజీ ప్రధాని పివి.నరసింహారావు దేశంలో ఆర్థిక సంస్కరణలు తేవడంతో పాటు ఆయన హయాంలోనే ఆర్బిట్రేషన్ చట్టం రూపుదిద్దుకునన్నదని జస్టిస్ రమణ తెలిపారు. ఈ కేంద్రం ఏర్పాటు బాధ్యత సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ లావు నాగేశ్వర రావు తీసుకోవాలని ఈ సందర్భంగా రమణ కోరారు.