ఆత్మహత్య చేసుకుంటానన్నాడు.. ఆత్మహత్యకు కారణమయ్యాడు
~ ప్రేమ పేరుతో యువతి వెంటపడి వేధించాడు
~ ప్రేమించకపోతే ప్రాణం తీసుకుంటానని బెదిరించాడు
~ ప్రేమను ఒప్పుకున్నాక యువతి ఆత్మహత్య చేసుకునేలా ప్రవర్తించాడు
కుత్బుల్లాపూర్ న్యూస్ విధాత్రి మే 29 : ప్రేమించకపోతే ప్రాణం తీసుకుంటానన్నాడు.. తనను కాదంటే తనువు చాలిస్తానన్నాడు.. తన ప్రేమను ఒప్పుకోకపోతే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించి చివరకు ఆ యువతి ఆత్మహత్యకు కారణమయ్యాడు ఓ ప్రబుద్ధుడు.
జీడిమెట్ల పోలీస్స్టేషన్ పరిధిలోని ఎన్ఎల్బీ నగర్లో నివాసం ఉండే బాలబోయిన కుమార్ కుమార్తె అఖిల (22) ప్రైవేటు ఉద్యోగం చేస్తుంది. అయితే…మంగళవారం రాత్రి అకస్మాత్తుగా ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. అఖిలను ఓరుగంటి అఖిల్ సాయిగౌడ్ అనే వ్యక్తి ప్రేమ పేరుతో వెంటపడి వేదించేవాడు. అతని ప్రేమను ఒప్పుకోకపోతే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడు. దీంతో తప్పని పరిస్థితుల్లో అఖిల అతని ప్రేమను ఒప్పుకుంది. ఇదే విషయాన్ని తన కుటుంబ సభ్యుల దృష్టికి తీసుకొచ్చింది. ఆమె ఇష్టాన్ని కాదనలేక బంధువుల సమక్షంలో అందరూ మాట్లాడడంతో కుటుంబ సభ్యులు కూడా ఒప్పుకున్నారు. ఇంతవరకు అంతా బాగానే ఉన్నా…ప్రేమను ఒప్పుకున్నప్పటి నుంచి సాయి గౌడ్ అఖిలను చాలా ఇబ్బందులకు గురిచేసేవాడు. రోడ్లమీద అందరూ చూస్తుండగానే కొట్టడం, చిత్రహింసలు పెట్టడం చేసేవాడు. అంతేకాకుండా ప్రతీ రోజు ఫోన్లో వేదించేవాడు. సదరు విషయం స్థానికంగా, బంధువులకు తెలవడంతో పెళ్లి చేసుకోనని అడ్డం తిరిగాడు. దీంతో అఖిల మానసికంగా కుంగిపోయి ఆత్మహత్య చేసుకున్నట్లు తండ్రి కుమార్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో వెల్లడించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని జీడిమెట్ల పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.