ఇళ్లు ఉన్న వారికే… మళ్లీ డబుల్ బెడ్ రూమ్ ఇల్లు
~ డబుల్ బెడ్రూం ఇళ్ల కేటాయింపుల్లో లోపించిన పారదర్శకత
~ అర్హులను వదిలి అనర్హులకు అందజేత
~ ఒకే కుటుంబంలో తల్లీకూతురూ… భార్యాభర్తలకు కేటయింపు
~ లబ్ధిదారుల జాబితాపై పూర్తి స్థాయి విచారణ జరిపించాలి
~ నిజాంపేట్ బిజెపి ఆధ్వర్యంలో కలెక్టర్ కు ఫిర్యాదు
~ బీఆర్ఎస్ నాయకులు, బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలి
ఇదే విషయంపై బీజేపీ నిజాంపేట కార్పొరేషన్ అధ్యక్షుడు ఆకుల సతీష్ మీడియా సమావేశాన్ని నిర్వహించి గురువారం పలు వివరాలు వెల్లడించారు. డబుల్ బెడ్రూం ఇళ్ల కేటాయింపుల్లో జరిగిన అవకతవకలను సరిదిద్ది అర్హులైన వారికే ఇళ్లు చెందేలా చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. గతంలో జేఎన్ఎన్ఎయూఆర్ఎం, ఆర్ జీ కే పథకాల ద్వారా ఇళ్లు పొందిన వారికి, ఒకే కుటుంబంలోని తల్లీకూతురుకి, భార్యాభర్తకు డబుల్ బెడ్రూంలు మంజూరు ఎలా సాధ్యమైందన్నారు. ఇలాంటి అన్ని ఆధారాలతో సుమారు 22 మందికి డబుల్ బెడ్రూంలు మంజూరు కావడం గుర్తించామాన్నారు. డబుల్ బెడ్రూం ఇళ్ల పంపిణీ అంతా కంప్యూటర్ ద్వారా రాండమైజేషన్ (యాదృచ్చికీకరణం) పద్దతిలో పారదర్శకంగా జరిగిందని గొప్పలు చెప్పుకున్న గత బీఆర్ఎస్ ప్రభుత్వ పెద్దలు ఏం సమాధానం చెప్పుతారని ఆరోపించారు. పెళ్లి కాని యువతి కూడా డబుల్ బెడ్రూం మంజూరు చేసినట్లు ఆధారాలు ఉన్నాయన్నారు. కుల ప్రాతిపదికన కూడా డబుల్ బెడ్రూం ఇళ్ల కేటాయింపుల్లో తప్పులు దొర్లాయన్నారు. దీంతో అసలు లబ్దిదారులు నష్టపోయారని తెలిపారు. దీనికి బాధ్యులైన అధికారులపై కూడా తగిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. అనర్హులైన వారి డబుల్ బెడ్రూంలను రద్దు చేసి అర్హులైన వారికి కేటాయించాలని, అప్పటి వరకు బీజేపీ పోరాడుతుందన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఎంపిక చేసిన లబ్దిదారుల జాబితాపై పూర్తిస్థాయి విచారణ జరిపి నిజానిజాలు వెలికి తీయాలన్నారు. సదరు అవకతవకలపై మేడ్చల్ జిల్లా కలెక్టర్ కు కూడా ఫిర్యాదు చేశామని సతీష్ తెలిపారు. ఈ కార్యక్రమంలో నిజాంపేట కార్పొరేషన్ కార్యదర్శి అరుణ్ రావు, ఓబిసి మోర్చా ప్రధాన కార్యదర్శి ముఖేష్, ఉపాధ్యక్షుడు కుమార్ గౌడ్, బీజేవైఎం ఉపాధ్యక్షులు నర్సింహారెడ్డి, కిషన్ మోర్చా ఉపాధ్యక్షుడు మాధవరావు, సీనియర్ నాయకుడు ఎల్లా స్వామి పాల్గొన్నారు.