ఎంఎల్ఆర్ ఐఏఈఆర్ కళాశాల ముందు విద్యార్థి సంఘాల నిరసన
దుండిగల్ (న్యూస్ విధాత్రి), ఆగస్టు 16 : ఇంజనీరింగ్ కళాశాలలో సీట్లు ఇస్తామని చెప్పి లక్షల రూపాయల అడ్మిషన్ ఫీజు తీసుకొని సీట్లు లేవని మోసం చేస్తున్న దుండిగల్ లోని మర్రి లక్ష్మణ్ రెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఏరోనాటికల్ ఇంజనీరింగ్ (ఎంఎల్ఆర్ ఐఏఈఆర్ ) కళాశాల ముందు ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి జేఏసీ, ఎస్ ఎఫ్ ఐ విద్యార్థి సంఘాలు నిరసనకు దిగారు. విద్యార్థుల నుంచి కోట్ల రూపాయల్లో ఫీజులు వసూలు చేసి కౌన్సెలింగ్ కూడా పూర్తయ్యే దశకు వచ్చిన అనంతరం తమ వద్ద సీట్లు లేవని, ఇతర కళాశాలలో తీసుకోవాలని వారిని మోసం చేశారని మండిపడ్డారు. ఎంఎల్ఆర్ఐటి కళాశాల అనుమతులను రద్దు చేయాలని, కళాశాల యాజమాన్యాన్ని అరెస్టు చేయాలని వారు డిమాండ్ చేశారు. కళాశాల యాజమాన్యం లోపల దాక్కుని గేటు వద్ద పెద్ద సంఖ్యలో బౌన్సర్లను పెట్టి బెదిరింపులకు పాల్పడుతూ అడ్డగిస్తున్నారని కళాశాల సిబ్బందితో వాదోపవాదాలకు దిగారు. దీంతో ఆ ప్రాంతమంతా గందరగోళంగా మారి ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.