ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే ల మధ్య దాడుల వరకు వెళ్లిన కుత్బుల్లాపూర్ భూ కబ్జాలు.
√ ప్రభుత్వ భూములు అన్యాక్రాంతమవుతున్న…నిమ్మకు నీరు వచ్చినట్టు వివరిస్తున్న రెవెన్యూ అధికారులు.
√ ప్రజా ప్రతినిధులు కబ్జాదారులకు వత్తాసు పలకడంతోనే ఈ దుస్థితి.
√ ఇప్పటికైనా భూకబ్జాదారులపై చర్యలు చేపట్టేలా ముందుకు సాగాలి.
√ సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి ఉమా మహేష్.
కుత్బుల్లాపూర్ (న్యూస్ విధాత్రి), అక్టోబర్ 26: కుత్బుల్లాపూర్ సర్కిల్ పరిధి సూరారంలోని రామ్ లీలా మైదానంలో ఓ టీవీ ఛానల్ నిర్వహించిన చర్చా వేదికలో ఎమ్మెల్యే కేపీ వివేకానంద్, మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ పై దాడి సంఘటన యావత్తు కుత్బుల్లాపూర్ నియోజకవర్గ దుస్థితిని తెలియజేస్తుందని సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి ఉమా మహేష్ అన్నారు.
దాడికి పరోక్షంగా కారణమైన భూ కబ్జాలు, భూకబ్జాదారులపై చర్యలు తీసుకోకుండా రెవెన్యూ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తూ కోట్ల రూపాయలు దండుకోవడం వల్లనే నాయకులకు ఈ దుస్థితి ఏర్పడిందన్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా సిపిఐ ఆధ్వర్యంలో పేద ప్రజలకు ఉచితంగా స్థలాలను పంచితే నాటి కాంగ్రెస్, నేటి బీఆర్ఎస్ ప్రభుత్వంలో కబ్జాదారులు వాళ్ల సొంత జాగీర్ లాగా పేద ప్రజల వద్ద లక్షల రూపాయలు తీసుకొని ప్రభుత్వ భూములను అమ్మేస్తున్నారని ఆరోపించారు. ఈ విషయంపై గత సంవత్సర కాలంగా సిపిఐ పోరాటం చేస్తూనే ఉందని, అయినప్పటికీ ప్రజా ప్రతినిధులు, అధికారులు పట్టించుకోకపోవడం వల్లే నేడు వందల ఎకరాలు ప్రభుత్వ భూమి అన్యాక్రాంతమై నాయకులు దాడి చేసుకునే వరకు వచ్చిందని అన్నారు. ఈనాడు నువ్వు కబ్జాకోరు…అంటే నువ్వు కబ్జాకోరు అంటూ వ్యక్తిగత దూషణలు, భౌతిక దాడులు జరగడం చూస్తుంటే కబ్జాల వల్ల రానున్న రోజుల్లో ఇంకెంత హింస చూడాల్సి వస్తుందోనని వాపోయారు. ఇప్పటికైనా ఎమ్మెల్యే వివేకానంద్, మాజీ ఎమ్మెల్యే, బీజేపీ అభ్యర్థి శ్రీశైలం గౌడ్ కబ్జాల వల్ల తమకు ఎంత చెడ్డ పేరు వచ్చిందో గ్రహించి కబ్జాదారులను శిక్షించే విధంగా చర్యలకు ఉపక్రమిస్తే బాగుంటుందని హితవు పలికారు. ఇది కేవలం ఇరు పార్టీల నాయకుల మధ్య జరిగిన గొడవ కాదని కబ్జాలో భాగస్వామ్యం ఉన్న ప్రతి ఒక్కరికి వర్తిస్తుందని అన్నారు.
గతంలో విలేకరులు అధికారులపై కబ్జాదారులు దాడి చేస్తే పట్టించుకోకుండా ఉండడం వల్లే నేడు ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేల మధ్య గొడవల వరకు వెళ్లిందని అన్నారు. గతంలో కబ్జాదారుల దాడులను ఖండించకపోవడంతోనే కబ్జాదారులు మరింత రెచ్చిపోయి విచ్చలవిడిగా కబ్జాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఈ సంఘటనలతోనైనా సంబంధిత అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు కూర్చోకుండా కబ్జాదారులపై తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.