కన్నతల్లి మరణాన్ని జీర్ణించుకోలేక ఉరి వేసుకొని తనువు చాలించిన కొడుకు
~ తల్లి ఆస్థికలు కలిపేందుకు వెళ్లిన తండ్రి..
అంతలోనే ఆనంత లోకాలకు తనయుడు
పేట్ బషీరాబాద్ (న్యూస్ విధాత్రి), జూలై 8 : కన్నతల్లి మరణాన్ని జీర్ణించుకోలేక ఆమెనే తలచుకుంటూ కొడుకు ఇంట్లో ఎవరు లేని సమయంలో ఫ్యానుకు ఉరి వేసుకొని తనువు చాలించాడు. ఈ సంఘటన పేట్ బషీరాబాద్ పోలీసు స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జీడిమెట్ల డివిజన్ పరిధి ఎంఎన్ రెడ్డి నగర్ లోని హనుమాన్ దేవాలయం సమీపంలో నివాసముండే గడ్డమీది బాలయ్య భార్య గత రెండు నెలల క్రితం చనిపోయింది. వీరికి పెద్ద కుమారుడు గణేష్ (32), ఎలక్ట్రిషన్ పని చేసే చిన్న కుమారుడు శ్రీనివాస్ (25) ఉన్నారు. ఆయితే శ్రీనివాస్ ను ఇంట్లో వదిలి పెట్టి బాలయ్య భార్య ఆస్తికలను కలిపేందుకు గణేష్ ను తీసుకొని ఆదివారం యాదగిరిగుట్టకు వెళ్లాడు. శ్రీనివాస్ కు1 తోడుగా ఉండేందుకు వారికి తెలిసిన సాంబ శివారెడ్డిని ఇంటికి వెళ్లమని తెలిపారు. దీంతో మధ్యాహ్నం సుమారు 1.30 గంటలకు వెళ్లి తలుపు ఎంత కొట్టినా తెరవకపోవడంతో అదే విషయాన్ని బాలయ్యకు చెప్పాడు. దాంతో బాలయ్య శ్రీనివాస్ స్నేహితులకు విషయాన్ని తెలిపి చూడమనగా వారు వచ్చి పిలిచినా పలకకపోవడంతో కిటికీ తలుపులు పగలకొట్టి లోపలికి చూడగా శ్రీనివాస్ తన తల్లికి చెందిన తెల్లచీరతో ఫ్యానుకు ఉరి వేసుకొని కనిపించాడు. దీంతో స్నేహితులు తలుపులు పగలగొట్టి శ్రీనివాస్ ను క్రిందకు దింపగా ఆప్పటికే మరణించినట్లు గుర్తించారు. తల్లి మరణాన్ని జీర్ణించుకోలేక మనస్తాపంతో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడని బాలయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.
• ఎలుకల మందు త్రాగిన వ్యక్తి చికిత్స పొందుతూ మృతి
పేట్ బషీరాబాద్ (న్యూస్ విధాత్రి), జూలై 8: ఎలుకల మందు త్రాగి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన పేట్ బషీరాబాద్ పోలీసు స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… వరంగల్ జిల్లా మహబూబాబాద్ నుంచి వచ్చి కొంపల్లి శివాలయం వెనుకాల నివాసం ఉంటున్న మాలోతు బీక్యా (59) బిగ్ బాస్కెట్ లో హౌస్ కీపింగ్ పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. రోజు మాదిరిగానే ఆదివారం ఉదయం సుమారు 6 గంటలకు విధులకు వెళ్లాడు. మధ్యాహ్నం సుమారు 2 గంటలకు పనికి వెళ్లిన తన భార్యకు ఫోన్ చేసి తాను ఎలుకల మందు త్రాగానని తెలిపాడు. ఆమె వచ్చి బీత్యాను చికిత్స నిమిత్తం కండ్లకోయలోని సీఎంఆర్ ఆస్పత్రికి తీసుకెళ్లింది. చికిత్స పొందుతూ అతను సోమవారం తెల్లవారుజాము సుమారు 4.40 గంటలకు మరణించాడు. మృతుడి భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.