కుటుంబ పెద్ద సంతకం ఫోర్జరీ చేసి మోసం
~ సొంత భార్య, తనయుడి నిర్వాకం
~ రూ. 30 లక్షల రుణం తీసుకున్న వైనం
~ కారు అదనపు రుణం కోసం వెళితే అసలు విషయం బయటకి
~ కుటుంబ కలహాలతో ఐదు సంవత్సరాలుగా వేరుగా ఉంటున్న కుటుంబం పెద్ద
~ తన సంతకం ఫోర్జరీ చేసి తనను పూచిదారుగా చూపి..
~ రుణం పొందారని జీడిమెట్ల పోలీసులకు లిఖితపూర్వకంగా బాధితుడి ఫిర్యాదు
కుత్బుల్లాపూర్ (న్యూస్ విధాత్రి), జూలై 11: సొంత భార్య, తనయుడే కుటుంబ పెద్ద సంతకాన్ని ఫోర్జరీ చేసి ఓ ప్రైవేటు ఫైనాన్స్ సంస్థ నుంచి రుణం తీసుకొని మోసం చేసిన సంఘటన జీడిమెట్ల పోలీసు స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఓ వ్యక్తి కారుపై ఆదనపు రుణం (టాప్ అప్ లోన్) తీసుకునేందుకు ఓ ప్రైవేటు బ్యాంకుకు వెళ్లగా ఆయనకు
చుక్కెదురైంది. తాను పూచీదారు (గ్యారంటీయర్) గా ఇప్పటికే ఇంటి తనఖాకు చెందిన రుణం ఉందని, సదరు రుణం వాయిదాలు సక్రమంగా చెల్లించడపోవడంతో సిబిల్ దెబ్బతినడంతో కారుపై ఆదనపు రుణం రాదని బ్యాంకు వారు నిర్ధారించారు. దీంతో బ్యాంకు ఇచ్చిన రుణ వివరాల ప్రతిని తీసుకొని వాకబు చేయడంతో తన సంతకాన్ని ఫోర్జరీ చేసి తనను పూచీదారుగా పెట్టి రూ. 30 లక్షల రుణం పొందిన్నట్లు తేలడంతో ఒక్కసారిగా కంగుతిన్నాడు.
వివరాల ప్రకారం…కుత్బుల్లాపూర్ డివిజన్ పరిధి వెంకటేశ్వర నగర్ లో నివాసం ఉండే ఇమ్మడి నర్సింహా అనే వ్యక్తి ప్రమేయం లేకుండానే ఆతని భార్య వరలక్ష్మీ, తనయుడు సాయికిరణ్ లు తనను పూచీదారుగా చూపుతూ తన సంతకాన్ని ఫోర్జరీ చేసి తాము ఉంటున్న సొంతింటి పై రూ.30 లక్షల రుణాన్ని బేగంపేటలోని చోళమండలం ఇన్వెస్ట్మెంట్ అండ్ ఫైనాన్స్ కంపెనీ లిమిటెడ్ సంస్థ నుంచి 2022 మార్చి నెలలో పొందారు. అయితే కొన్ని కుటుంబ కలహాల కారణంగా నర్సింహాతో భార్య, కొడుకు గత 5 సంవత్సరాల క్రితం గొడవలు పడి కొట్టుకోవడంతో పాటు తనను ఇంటి నుంచి గెంటివేశారని, అప్పటి నుంచి తాను వేరుగా ఉంటున్నానని నర్సింహా తెలిపాడు. ఇళ్లు తన భార్య వరలక్ష్మీ పేరు మీదే ఉన్నప్పటికీ తనకు సంబంధించిన పాన్ కార్డు, ఆధార్ కార్డులను ఫైనాన్స్ సంస్థకు అందించి తన ప్రమేయం లేకుండా సంతకాన్ని సైతం ఫోర్జరీ చేసి తనను పూచిదారుగా పెట్టి ఇంటి తనఖా రుణాన్ని పొందారని తెలిపాడు. సదరు రుణ వాయిదాలను కూడా గత కొన్ని నెలలుగా చెల్లించకపోవడంతో తన సిబిల్ దెబ్బతిన్నదని, కారు ఆదనపు రుణం కోసం బ్యాంకుకు వెళ్లితే అసలు విషయం బయట పడిందన్నాడు. ఇదే విషయాన్ని తెలుపుతూ తన భార్య కొడుకుపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని, లేనిపక్షంలో వారు మరిన్ని మోసాలు చేసే అవకాశం ఉందని, జీడిమెట్ల పోలీసులకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశాడు. తొలుత ఫిర్యాదు అందుకున్న పోలీసులు నర్సింహా భార్య కొడుకును పిలిపించి మాట్లాడుతామని, వారు పిఎస్ కు వచ్చిన ఆనంతరం నర్సింహా పైనే వేధింపుల కేసు పెట్టమని పోలీసులు తెలపడమే కాకుండా సదరు కేసు మా పరిధిలోకి రాదు బేగంపేట పీఎస్ లో ఫిర్యాదు చేయాలని వారు తెలపడంతో అవాక్కయ్యానని నర్సింహా తెలిపాడు.