కేఎల్ యూనివర్సిటీ నిర్వాహకులపై హత్యాయత్నం కేసు నమోదు చేయాలి
• సూరారం సిఐకు వినతిపత్రం అందజేసిన సిపిఐ నాయకులు
• ఏ ప్రభుత్వమైనా పేదలకు న్యాయం జరగడం లేదని వ్యాఖ్య
• చిన్న చిన్న కేసుల వల్ల ఒరిగేదేమీ లేదని, బలమైన కేసులు నమోదు చేయాలని డిమాండ్
గాజులరామారం (న్యూస్ విధాత్రి), జూలై 23 : గాజులరామారం సర్కిల్ పరిధిలోని కేఎల్ యూనివర్సిటీ యాజమాన్యం, సిబ్బందిపై హత్యాయత్నం కేసు నమోదు చేయాలని సిపిఐ కుత్బుల్లాపూర్ నియోజక వర్గ కార్యదర్శి ఉమా మహేష్ ఆధ్వర్యంలో సిపిఐ నాయకులు డిమాండ్ చేశారు. సూరారం పోలీస్ స్టేషన్ సిఐ భరత్ కుమార్ కు ఈ మేరకు వినతి పత్రాన్ని వారు మంగళవారం అందజేశారు. వివరాల్లోకి వెళ్తే…గాజులరామారంలోని సర్వే నెంబర్ 434/1, 435/1లో లాల్ సాహెబ్ గూడకు చెందిన దారా పద్మావతికి ఆమె తండ్రి బొడ్డు రఘుపతి నుంచి వచ్చిన కొంత భూమి ఉంది. ఈ నెల 13వ తేదీన (శనివారం) సదరు స్థలంలోకి వెళ్తుంటే కేఎల్ యూనివర్సిటీ సెక్యూరిటీ, అందులో పని చేసే సూపర్వైజర్ వారిని తమ స్థలంలోకి వెళ్లకుండా అడ్డుకున్నారు. దీంతో పద్మావతి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. ఈ విషయం తెలుసుకున్న కేఎల్ సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేస్తారా…అని పద్మావతి కుమారుడు దారా నర్సింగ్ రావుపై భౌతిక దాడి చేసి విచక్షణా రహితంగా కొట్టారు. అంతేకాకుండా ‘సదరు స్థలం కేఎల్ యూనివర్సిటీదని, మా యాజమాన్యం మిమ్మల్ని చంపి పేగులు మెడలో వేసుకోమన్నారని.. మళ్లీ ఇటువైపు వస్తే చంపేస్తామని’ సిబ్బంది బెదిరించారు.
✓ కేఎల్ వర్సిటీ యాజమాన్యం, సిబ్బందిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు…
పద్మావతి అందించిన ఫిర్యాదు మేరకు కేఎల్ యూనివర్సిటీ యాజమాన్యం, సిబ్బందిపై ఈనెల 19వ తేదీన సూరారం పోలీస్ స్టేషన్లో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కింద కేసును పోలీసులు నమోదు చేశారు. ఈ కేసులో కేఎల్ యూనివర్సిటీ నిర్వాహకులు హవీష్ కుమార్, కోనేరు సత్యనారాయణ, కే. రాజన్న, పవన్ కుమార్, నిఖిల్ తో పాటు ఇతరులను చేర్చి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
✓ బలమైన కేసులను నమోదు చేసి కఠినంగా శిక్షించాలి. – సిపిఐ
బాధితులను విచక్షణారహితంగా కొట్టి చంపేందుకు కూడా సిద్ధపడ్డ కేఎల్ యూనివర్సిటీ సిబ్బందిపై కేవలం బెయిలబుల్ కేసును నమోదు చేసి, వారిని ప్రేరేపించిన యాజమాన్యంపై ఎటువంటి కేసు నమోదు చేయకపోవడం విడ్డూరంగా ఉందని సిపిఐ నాయకులు ఆరోపించారు. కేఎల్ యూనివర్సిటీ యాజమాన్యం, సిబ్బందిపై హత్యాయత్నం కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. వారిపై కేవలం భూమికి సంబంధించి ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేస్ నమోదు వల్ల నిందితులకు ఎలాంటి ఇబ్బంది లేదని, హత్యాయత్నం కింద కేసు నమోదు చేస్తే భవిష్యత్తులో మరెవరూ ప్రజల పైన దాడి చేయరని వినతి పత్రంలో పేర్కొన్నారు. చిన్న చిన్న కేసులు నమోదు చేయడం వల్ల కబ్జాదారులు భయపడటం లేదని తెలిపారు. గత బిఆర్ఎస్ ప్రభుత్వంలో, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా పేద ప్రజల కు న్యాయం జరగట్లేదని, ఇప్పటికైనా పోలీస్ అధికారులు నిందితులపై బలమైన కేసులు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని కోరారు. సిఐ కు వినతి పత్రం అందించిన వారిలో ఏఐటీయూసీ కార్యదర్శి శ్రీనివాస్, సీపీఐ నాయకులు చంద్రమోహన్, బాలయ్య,సురేష్ పాల్గొన్నారు.