కోరిన కోర్కెలు తీర్చే దివ్య క్షేత్రంగా కళ్యాణ తిరుపతి

కుత్బుల్లాపూర్ (న్యూస్ విధాత్రి),  ఆగస్టు 31:   కొలిచిన వారి కోరికలు తీర్చే దివ్య క్షేత్రంగా కుత్బుల్లాపూర్ నియోజక వర్గంలోని పద్మా నగర్ ఫేస్-1 లోని కళ్యాణ తిరుపతి దేవాలయం శ్రీ దేవి, భూదేవి సహిత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవాలయం వెలుగొందుతోంది. సుందరధామంగా తీర్చిదిద్దిన ఈ దేవాలయంలో శ్రీవారు దివ్య మంగళ స్వరూపులై నెలకొని భక్తుల కొంగుబంగారంగా అలరారుతున్నారు. మహిమాన్వితుడైన శ్రీవారిని భక్తులు నిత్యం దర్శించుకుని పూజలు, భజనలతో కొలిచి పరవశించిపోతున్నారు.

ఆలయ నిర్మాణం…
శ్రీ వెంకటేశ్వర ఆలయ కమిటీ వారు 1998లో సుమారు 1000 చదరపు అడుగుల స్థలంలో భూమి పూజ చేసి నాలుగు అంతస్తుల ఆలయ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. నాటి నుంచి పదేళ్లు శ్రమించి 2008 సంవత్సరంలో శ్రీదేవి, భూదేవి సహిత శ్రీ వెంకటేశ్వర స్వామి విగ్రహ ప్రతిష్ట గావించారు. నాటి నుంచి శ్రీవారికి నిత్య పూజలు, అభిషేకాలతో నిర్విఘ్నంగా పూజలు నిర్వహిస్తున్నారు. అదేవిధంగా ఆలయం అంచలంచలుగా భక్తుల భాగస్వామ్యంతో దినదినాభివృద్ధి చెందుతూ అదనపు నిర్మాణ పనులు కొనసాగిస్తున్నారు.

ఆలయ పేరులో విశేషం…
కళ్యాణ తిరుపతి అని నామకరణం చేయడానికి సుమారు 500 పేర్లు పరిశీలించామని నిర్వాహకులు తెలిపారు. కల్యాణ అంటే సంక్షేమం, శుభం, వివాహంతో పాటు పలు అర్థాలు వస్తాయి. తిరు అంటే లక్ష్మీదేవి, తిరుపతి అంటే వెంకటేశ్వర స్వామి అనే అర్థాలు ఉండడం వలన ఆ పేరును ఖరారు చేసామని నిర్వాహకులు తెలిపారు


ఆలయ విశేషాలు..

హైందవ సాంప్రదాయం ఉట్టిపడే విధంగా వాస్తుకు అనుగుణంగా ప్రత్యేక ప్రాకారాలతో ఆలయ నిర్మాణం చేశారు. దేవతామూర్తుల విగ్రహాలను అలిపిరిలో తయారు చేయించి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) వారు అందజేయడం ఇక్కడ విశేషం. ఈ విగ్రహం సాక్షాత్తు తిరుమల శ్రీవారిని మైమరిపిస్తుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఈ ఆలయ లోగోను ప్రముఖ చిత్రకారులు బాపు రూపొందించి ఆయన సంతకాన్ని కూడా చేశారు.

పాద పీఠముల నుంచి కిరీటం వరకు మూలకుబేరుల ఎత్తు వివరాలు…
>  వెంకటేశ్వర స్వామి వారు 9 అడుగుల మూడు అంగుళాలు.
> శ్రీదేవి అమ్మవారు ఏడు అడుగుల 8 అంగుళాలు.
> భూదేవి అమ్మవారు ఏడడుగుల 10 అంగుళాలుగా రూపొందించారు.

కళ్యాణ మండప ప్రత్యేకత...
దేవాలయంలో విశాలమైన కళ్యాణ మండపం ఉంది. ఈ కళ్యాణ మండపంలో ఒకేసారి సుమారు నాలుగువేల మంది వరకు పట్టే సామర్థ్యం కలదు. దివ్యాంగులకు, పేదవారికి ఈ కళ్యాణ మండపాన్ని ఉచితంగా ఇస్తారు. ఇతరులు కళ్యాణ మండపానికి ఒక రోజుకు పదివేలు చెల్లించాల్సి ఉంటుంది. కళ్యాణ మండపం తీసుకున్నవారు శుభకార్యాలకు కింది, మొదటి అంతస్తులను ఉపయోగించుకోవచ్చు. ఈ కళ్యాణ మండపంలో వివాహాలు, నిశ్చితార్థాలు, సత్యనారాయణ వ్రతాలు, అయ్యప్ప స్వామి పడిపూజలతో పాటు హిందూ సాంప్రదాయం ప్రకారం ఏ శుభకార్యం అయినా నిర్వహించుకోవచ్చు. అలాగే జన్మదిన వేడుకలను కూడా చేసుకోవచ్చు కానీ… కేకులను మాత్రం కట్ చేయకూడదు అనే నిబంధన ఉంది.

ఆలయంలో నిర్వహించే పూజలు…
వైకుంఠ ఏకాదశి అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. ధనుర్మాసంలో తిరుప్పావై (గోదాదేవికి ఇష్టమైన పూజ), కుంకుమార్చన, నివేదన, మంత్రపుష్పం, ధూప దీపోత్సవం, మండపోత్సవం వంటి పూజలు నిర్వహిస్తారు. అదేవిధంగా వైకుంఠ ఏకాదశి నాడు భక్తులకు ఉత్తర ద్వార దర్శనం కల్పిస్తారు. వైకుంఠ ఏకాదశి నాడు కుడరై నైవేద్యం ప్రత్యేకం. భోగి రోజు గోదా రంగనాదుల కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. కార్తీకమాసంలో సామూహిక సత్యనారాయణ వ్రతాలు, కార్తీక దీపాలంకరణ, కార్తీకమాసంలో కళ్యాణ మహోత్సవం, లక్ష పుష్పార్చన, కనకాభిషేకం ప్రత్యేకంగా నిర్వహిస్తారు. ప్రతి శనివారం రాత్రి 8 గంటలకు నక్షత్ర హారతి జరుగుతుంది. స్వామి వారి జన్మ నక్షత్రమైన శ్రవణ నక్షత్రం రోజు మూల విరాట్లకు శ్రవణా నక్షత్ర అభిషేకం ఘనంగా నిర్వహిస్తారు. ప్రతి శుక్రవారం ఉత్సవమూర్తులకు అభిషేకం జరుగుతుంది. స్వామి వారి కళ్యాణం, వినాయక చవితి, బ్రహ్మోత్సవాలు, దేవీ నవరాత్రులతో పాటు భక్తులకు అన్నసంతర్పణ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ప్రతి శనివారం స్వామివారి సన్నిధిలో అన్నమాచార్య కీర్తనలు ధ్యానం చేయబడతాయి. ప్రతి బుధ, ఆదివారాలో ప్రజలకు సాంప్రదాయ సంగీతంపై ఆలయ ప్రాంగణంలో శిక్షణ ఇస్తారు. అదేవిధంగా ప్రతిరోజు సాయంత్రం 6:30 లకు మహాభారతం, రామాయణం, భాగవతం వంటి మహా కావ్యాల ప్రవచనాలు చెప్తారు.

తలనీలాల సమర్పణ…
ఈ ఆలయంలో తిరుపతిలో స్వామివారికి సమర్పించే విధంగా తలనీలాలను కూడా సమర్పిస్తారు. వీలుకాని,స్తోమత లేని,తిరుపతి వెళ్లలేని భక్తులు మొక్కులు తీర్చుకునేందుకు ఈ ఆలయంలో ముడుపులుగా చెల్లిస్తుంటారు. వృద్ధులు, చిన్నపిల్లలు, దివ్యాంగుల కోసం ఆలయ అభివృద్ధిలో భాగంగా ఇటీవల గిఫ్ట్ సౌకర్యాన్ని ఏర్పాటు చేశారు.

ఆలయ ప్రాంగణంలో బుక్ స్టాల్…
ఆలయంలో ఉన్న బుక్ స్టాల్ లో హిందూ మతానికి సంబంధించిన మహా కావ్యాలైన రామాయణం, మహాభారతం, భాగవతం, భగవద్గీతతో పాటు వివిధ భగవంతుల దేవతామూర్తుల పూజా విధానాలకు సంబంధించిన పుస్తకాలను విక్రయిస్తారు.

ఆలయ కమిటీ ఆలోచనా…
ఆలయ కమిటీ వారు ప్రతి శనివారం అన్నసంతర్పణ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. భక్తుల ఆరోగ్యం దృశ్య ఆలయం తరఫున వైద్యశాలను ఏర్పాటు చేయడానికి కంకణం కట్టుకున్నారు.

శ్రీవారి కి సేవలు చేయడం మా పూర్వజన్మ సుకృతం.
శ్రీవారి ఆలయ నిర్మాణ సమయంలో అనేక ఇబ్బందులను, ఆటుపోట్లను ఎదుర్కొన్నాం. సమస్యలన్నిటిని అధిగమించి శ్రీవారి దయతో ఆలయ నిర్మాణాన్ని పూర్తి చేశాం. శ్రీవారి ఆలయం నిర్మించి సేవలు చేయడం మా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాం. భగవంతుని కృప ఉన్నంతవరకు స్వామివారికి మా శక్తి కొలది సేవలు చేస్తాం. చుట్టుపక్కల ప్రజలతోపాటు ప్రతివారికి శ్రీవారి కృపా కటాక్షాలు ఉండాలని ఆశిస్తున్నాం. ఆలయ అభివృద్ధి లో ప్రజల భాగస్వామ్యం ఎంతగానో సహకరిస్తుంది.
-ఆలయ అభివృద్ధి కమిటీ

Leave A Reply

Your email address will not be published.

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More