క్యాబ్ ను అడ్డగించి సాఫ్టు వేర్ ఉద్యోగుల వద్ద అర్ధరాత్రి దోపిడి
– మద్యం మత్తులో ఆకతాయిల ఆగడాలు
– క్యాబ్ డ్రైవర్ మెడపై బ్లేడుతో దాడి
– సెల్ ఫోన్లు, నగదు దోచుకున్న ఆకతాయిలు
కుత్బుల్లాపూర్ (న్యూస్ విధాత్రి), మే 30 : మద్యం మత్తులో ఆకతాయిలు అర్ధరాత్రి క్యాబ్ ను అడ్డగించి, డ్రైవర్ పై దాడి చేసి సాఫ్ట్ వేర్ ఉద్యోగుల వద్ద దోపిడీకి పాల్పడిన సంఘటన జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం… గురువారం అర్ధరాత్రి 2.30 గంటలకు అనిల్ (24) తన క్యాబ్ లో ఇద్దరు సాఫ్ట్ వేర్ ఉద్యోగులను మాదాపూర్ నుంచి జీడిమెట్ల పిఎస్ పరిధిలోని నెహ్రూ నగర్ కు తీసుకు వెళ్తున్నాడు. ఈ క్రమంలో నెహ్రూ నగర్ ప్రధాన రహదారికి చేరుకోగానే మున్నా, రాజా సింగ్, అఖిల్ తో పాటు మరో ఇద్దరు ఆకతాయిలు మద్యం మత్తులో క్యాబ్ ను అడ్డగించి ఉద్యోగుల వద్ద డబ్బు డిమాండ్ చేశారు. వారి వద్ద నుంచి సెల్ ఫోన్లు, కొంత నగదును లాక్కున్నారు. అంతేకాకుండా డ్రైవర్ మెడపై బ్లేడుతో దాడి చేసి గాయపరిచారు. దీనిని గమనించిన స్థానికులు డ్రైవర్ అనిల్ ను స్థానికంగా ఉన్న ఓ ప్రైవేట్ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. అర్దరాత్రి తాగుబోతులు, ఆకతాయిలతో తమకు రక్షణ లేదని, దాడులు ఎక్కువైయ్యాయని క్యాబ్ డ్రైవర్ లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జీడిమెట్ల పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు