గణేష్ నగర్ నాలా కల్వర్టు పనులను పరిశీలించిన నగర మేయర్
కుత్బుల్లాపూర్ (న్యూస్ విధాత్రి), ఆగస్టు 30 : కుత్బుల్లాపూర్ డివిజన్ పరిధి గణేష్ నగర్ లో నిర్మిస్తున్న నాలా కల్వర్టును నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి, కూకట్పల్లి జోనల్ కమిషనర్ అపూర్వ్ చౌహాన్ తో కలిసి పరిశీలించారు. గత వర్షాకాలంలో వరదలు వచ్చి నాలా పరివాహక ప్రాంతాలు నీట మునిగి ఇళ్లల్లోకి నీళ్లు చేరాలని ఆ సమయంలో స్థానిక ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ తో కలిసి తాను పరిశీలించామని అన్నారు. అప్పుడు మోకాళ్ళ లోతు వరద నీరు వచ్చి కాలనీలో చేరడం వల్ల, స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని మేయర్ తెలిపారు. ప్రస్తుతం ఆ దుస్థితి లేకుండా నాలా కల్వర్టు పనులను వేగవంతంగా పూర్తి చేస్తున్న అధికారుల పనితీరును అభినందించారు. మిగిలి ఉన్న కల్వర్టు నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేసి ప్రజల రాకపోకలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూడాలని మేయర్ సూచించారు. త్వరలోనే గణేష్ నగర్, రాంరెడ్డి నగర్ మధ్య ఉన్న నాలా కల్వర్టు పనులను కూడా పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటామని ఆమె హామీ ఇచ్చారు. నాలా పనులు పూర్తి చేసేలా సహకరించిన మేయర్ ను స్థానికులు శాలువా కప్పి పూలదండతో సన్మానించారు. అంతకుముందు జీడిమెట్ల డివిజన్ పరిధిలోని ఎన్నా చెరువును, సూరారం లింగం చెరువును మేయర్ పరిశీలించి గణేష్ నిమజ్జనానికి ఎటువంటి ఇబ్బందులు కలవకుండా ప్రజలు తీసుకోవాలని ఆమె అధికారులను సూచించారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ బొడ్డు వెంకటేశ్వరరావు, ఎస్ ఈ చిన్నారెడ్డి, కుత్బుల్లాపూర్ ఉప కమిషనర్ వి. నరసింహ, ఏఎంసీ ఉదయ్ కుమార్, ఈ ఈ లక్ష్మీ గణేష్, ఏ ఎం ఓ హెచ్ కవిత, డి ఈ పాపమ్మ, ఏఈ మల్లారెడ్డి, టిపిఓ ప్రభావతి, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది కాలనీ సంక్షేమ సంఘం సభ్యులు పాల్గొన్నారు.