ఘనంగా గణనాథుని నిమర్జనాలు
కుత్బుల్లాపూర్ (న్యూస్ విధాత్రి), సెప్టెంబర్ 15: గణేష్ నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని 9వ రోజైన ఆదివారం గణనాథుని నిమజ్జనాలను ఘనంగా నిర్వహించారు. 9వ రోజైన ఆదివారం కార్యాలయాలకు పాఠశాలలకు సెలవు రోజు కావడంతో అటు కాలనీలు, బస్తీలతో పాటు అపార్ట్మెంట్లలో ఏర్పాటు చేసిన మండపాల్లోని వందలాది గణనాథుల శోభాయాత్రలు నిమజ్జనానికి చెరువుల బాట పట్టాయి.
ఉదయం నుంచి భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించి, అన్నప్రసాద సంతర్పణలు చేసి, ఉట్లను కొట్టి, అనంతరం మేళ తాళాలు, డప్పు వాయిద్యాలు, డీజే లతోపాటు విద్యుత్ దీపాల అలంకరణలతో ఘనంగా గణనాథులను సాగనంపారు.
పద్మా నగర్ ఫేజ్ 2లోని శ్రీ సాయి నిలయం అపార్ట్మెంట్లో ఏర్పాటు చేసిన మండపంలోని వినాయక లడ్డును అపార్ట్మెంట్ వాసి తిరుపతి రూ. 26,001కి వేలం పాటలో చేజిక్కించుకున్నారు.