జంట సర్కిళ్ల లో పట్టణ ప్రణాళిక విభాగాల ప్రక్షాళన
న్యూస్ విధాత్రి ఎఫెక్ట్…
~ కుత్బుల్లాపూర్, గాజులరామారం సర్కిళ్ల లో అధికారుల బదిలీల పర్వం
~ ఏళ్ల తరబడి పాతుకుపోయిన అధికారులు
~ పలు ఆరోపణ నడుమ ఎట్టకేలకు బదిలీలు
కుత్బుల్లాపూర్ (న్యూస్ విధాత్రి), సెప్టెంబర్ 27: కుత్బుల్లాపూర్ గాజులరామారం జంట సర్కిళ్ల పట్టణ ప్రణాళిక విభాగం పలు ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారుల నుంచి మోక్షం కలిగిందా…? అంటే అవుననే సమాధానాలే వినిపిస్తున్నాయి. ఇటీవల జరిగిన సాధారణ బదిలీల్లో పలువురు అధికారులు బదిలీ అయినా జంట సర్కిళ్ల పరిధిలోని పట్టణ ప్రణాళిక విభాగంలోని సెక్షన్ అధికారులు మాత్రం బదిలీ కాకుండా ఏళ్ల తరబడి కుర్చీకి అతుక్కుపోయారు. అందులో పలువురు అధికారులు ఒకే ప్రాంగణంలో ఉన్న జంట సర్కిళ్ల లో అటు కుత్బుల్లాపూర్, ఇటు గాజులరామారం సర్కిల్ లకు బదిలీలు చేయించుకుంటూ ఏళ్ల తరబడి పాతుకుపోయారు. దీంతో ఆయా సర్కిల్లో ఉన్నతాధికారుల ఆదేశాలను సైతం లెక్కచేయకుండా వారు ఆడింది ఆట.. పాడిందే పాటగా కొనసాగింది. ఈ నేపథ్యంలో వారిపై పలు ఆరోపణలు వెలువెత్తాయి. ఇటీవల కాలంలో వారు మరింత పెట్రేగిపోవడంతో పలు పత్రికల్లో కథనాలతో పాటు పౌరుల నుంచి కూడా అవినీతి ఆరోపణలపై ఫిర్యాదులు ఉన్నతాధికారులకు అందడంతో వారు బదిలీల దిశగా చర్యలు చేపట్టారు. దీంతో ముకుమ్మడిగా జంట సర్కిళ్ల లో ఒకేసారి పట్టణ ప్రణాళిక అధికారులను బదిలీల చేస్తూ శుక్రవారం సాయంత్రం ఉన్నతాధికారులు ఉత్తరులను జారీ చేశారు.
~ బదిలీ అయిన అధికారులు…
కుత్బుల్లాపూర్ సర్కిల్లో సెక్షన్ అధికారిగా పనిచేస్తున్న ప్రభావతిని మూసాపేట్ సర్కిల్ సెక్షన్ అధికారిగా బదిలీ చేయగా ఆమె స్థానంలో శేర్లింగంపల్లి సర్కిల్ నుంచి నూతన శిక్షణ అధికారిగా రమేష్ నియామకమయ్యారు. అలాగే గాజులరామారం సర్కిల్ లోని సెక్షన్ అధికారులుగా విధులు నిర్వహించిన జెకే నరేష్, సంగీత భాయి ని బదిలీ చేస్తూ ఉత్తర్వులు వెలుపడ్డాయి. సంగీత భాయ్ ని మల్కాజ్గిరి సర్కిల్ కు బదిలీ చేయగా ఆమె స్థానంలో తుల్జా సింగ్ ను నూతన సెక్షన్ అధికారిగా నియమించారు. అయితే జెకె నరేష్ ను గోషామహల్ సర్కిల్ కు బదిలీ చేయగా ఆయన స్థానంలో నూతన సెక్షన్ అధికారి నియామకం జరగాల్సి ఉంది. గాజులరామారం ఏసిపి సంతోష్ కుమార్ ఖైరతాబాద్ జోనల్ కార్యాలయానికి బదిలీ అవ్వగా… గాజులరామారం సర్కిల్ నూతన ఏసీపీగా కూకట్పల్లి ఏసిపి రమేష్ కు ఇన్చార్జిగా బాధ్యతలు అప్పగించినట్లు సమాచారం.