~ ఓటు వేసి మద్దతు తెలపాలని వినతి
~ విజయం అంచున గాయకురాలు వైష్ణవి కొవ్వూరి
కుత్బుల్లాపూర్ (న్యూస్ విధాత్రి), జూన్ 10 : పాటంటే ఆమెకు ప్రాణం… పాడడం అంటే ఎనలేని మక్కువ… సంగీతం అంటే సంబరం. భాషతో ఆమె కు సంబంధం లేదు… భావం తో పాట పాడడమే ఆమె వంతు. భాష రాకపోతే భాషను సైతం నేర్చుకుని మరీ గాత్రం కలపడం ఆమె పట్టుదల. అందుకేనేమో పిన్న వయసు నుంచి ఆమె పాడిన ప్రతి పాటకు ప్రాణం పోస్తూ… భావం ఉట్టిపడేలా పల్లవిలో ప్రయాణిస్తుంది. పాల్గొన్న ప్రతీ పాటల పోటీల్లో ప్రత్యర్థులకు గట్టి పోటీనిస్తూ తనదైన శైలిలో రాణిస్తూ విజయాల అంచున నిలుస్తూ… విజయాలను కైవసం చేసుకుంటూ ముందుకు సాగుతున్న మన తెలుగింటి అమ్మాయి గాయకురాలు వైష్ణవి కొవ్వూరి.
తన గేయ ప్రస్థానాన్ని ప్రారంభించినప్పటి నుంచి అంచలంచెలుగా ఎదుగుతూ పలు పోటీల్లో అనేక బహుమతులను ప్రశంసలను అందుకుంది. ఇటీవల నిర్వహించిన తెలుగు ఇండియన్ ఐడియల్ పోటీల్లో పాల్గొని ద్వితీయ రన్నర్ అప్ (తృతీయ స్థానం) ను కైవసం చేసుకుని తన సత్తాను చాటింది. అదే స్ఫూర్తితో రెట్టింపు ఉత్సాహంతో తమిళ భాషలో నిర్వహిస్తున్న సూపర్ సింగర్ 10లో
పాల్గొని మరోసారి తెలుగు వారి సత్తా ఏంటో నిరూపించనుంది. తమిళ భాష రాకపోయినా కేవలం పాడడం కోసమే తమిళం నేర్చుకుని 25 మంది తమిళ గాయకులు పాల్గొన్న సూపర్ సింగర్ లో పోటీ పడుతుంది. ఈ పోటీల్లో ఇప్పటి వరకు జరిగిన 25 ఎపిసోడ్లలో 25 పైచిలుకు తమిళ పాటలను పాడి తన స్థానాన్ని భద్రపరచుకుంది. చివరి దశకు చేరుకున్న సూపర్ సింగర్ 10 లో రెండవ ఫైనల్ లిస్ట్ గా నిలబడి ప్రథమ స్థానాన్ని కైవసం చేసుకునేందుకు గట్టి పట్టుదలతో శ్రమిస్తుంది. ఆ అమ్మాయి శ్రమ, పట్టుదలతో పాటు మన వంతు సహాయం కూడా మన తెలుగింటి అమ్మాయికి ఇప్పుడు ఎంతో కీలకం కానుంది. పోటీల్లో భాగంగా నిర్వహించే ఓటింగ్ ప్రక్రియలో మనం వేసే ప్రతి ఒక్కరి ఓటు కూడా ఆమెను విజేతగా నిలిపేందుకు మార్గం సుగమం చేయనున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరు ఆ అమ్మాయి కి ఓటు వేసి మద్దతుగా నిలబడతారని ఆశిస్తున్నారు. ఈనెల 15వ తేదీ (శనివారం) నుంచి ఓటింగ్ ప్రక్రియ హాట్ స్టార్ యాప్ లో ప్రారంభం కానుంది. హాట్ స్టార్ యాప్ లో కానీ, మిస్సెడ్ కాల్ ఇవ్వడం ద్వారా కానీ వైష్ణవికి మద్దతు తెలుపవచ్చు.