త్రిపురా….’ల్యాండ్ మార్క్’ దౌర్జన్యం…
• పక్కన ఉన్న రైతుల భూమిపై కన్ను
• అక్రమంగా ఆక్రమించుకునేందుకు యత్నాలు
• అడ్డొచ్చిన వారిపై కిరాయి రౌడీ మూకలతో దాడులు
• బాధితులపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు బనాయింపు
• దొమ్మర పోచంపల్లి లో రోజు రోజుకు ముదురుతున్న భూ వివాదం
కుత్బుల్లాపూర్ (న్యూస్ విధాత్రి), మే 24: భూ వివాద విషయంలో ఇరువర్గాల వారు ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకోవడం, తగాదాలకు దిగి దాడులు చేసుకున్న సంఘటన దుండిగల్ మున్సిపాలిటీలోని దొమ్మర పోచంపల్లి గ్రామానికి చెందిన సర్వేనెంబర్ 183 , 188 లో బుధవారం జరిగిన విషయం విధితమే. తమ భూమిని త్రిపుర భవన నిర్మాణ సంస్థకు విక్రయించేందుకు తాము నిరాకరించడంతోనే తమపై కక్ష కట్టి తరాలుగా వస్తున్న భూమిని దౌర్జన్యంగా లాక్కునేందుకు వారిని చిత్రహింసలు పెడుతున్నారని రైతుల వాదన కాగా… మరోవైపు సదరు స్థలం తమదేనంటూ దానిలో పనులు చేసుకుంటుంటే తమపై తప్పుడు ఆరోపణలను చేస్తూ పనులకు నిత్యం పలువురు ఆటంకం కలిగిస్తున్నారని త్రిపుర ల్యాండ్ మార్క్ సంస్థ వాదన. దీంతో ఇరువు వర్గాల నడుమ భూవివాదం తలెత్తింది. ఎప్పటినుంచో వివాదంలో ఉన్న సదరు భూ తగాదా కోర్టుకు కూడా చేరడంతో న్యాయస్థానం రైతులకు మద్దతుగా ఇంజక్షన్ ఆర్డర్ (యధాస్థితిని కొనసాగించాలని ) ఉత్తర్వులు జారీ చేసింది. కోర్టు ఉత్తర్వులను సైతం బే ఖాతాల చేస్తూ త్రిపుర సంస్థ కిరాయి రౌడి మూకలతో దౌర్జన్యంగా తమ స్థలంలోకి చొరబడుతున్నారని రైతులు వాపోతున్నారు.
6 ఎఫ్ ఐ ఆర్ లు నమోదైన మారని తీరు…
ఈనెల 16వ తేదీన సదరు నిర్మాణ సంస్థ పలువురు కిరాయి రౌడిలను తీసుకొని వచ్చి తమ స్థలం చుట్టూ వేసుకున్న ప్రహరీని తొలగించి తమ స్థలాన్ని అక్రమంగా ఆక్రమించుకునేందుకు యట్నించారని, దానిని అడ్డుకునేందుకు ప్రయత్నించిన తమను వెంబడించి ప్రాణాలు తీసేందుకు కూడా వెనకాడలేదని బాధితులు వెల్లడించారు. ఇదే విషయంపై 17వ తేదీన దుండిగల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు కూడా చేసామన్నారు. గతంలో కూడా నిర్మాణ సంస్థపై 6 కేసులు పెట్టామని ఎఫ్ఐఆర్ లు నమోదైన అనంతరం కూడా తమపై దాడులకు దిగడం వారి అరాచకానికి నిదర్శనం అన్నారు.
పోలీస్ స్టేషన్లో పరస్పర ఫిర్యాదులు…
గురువారం (23వ తేదీన) ఇరువర్గాలు మరోమారు వెంట వెంటనే దుండిగల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదుల పర్వం కొనసాగించారు. దొమ్మర పోచంపల్లి గ్రామానికి చెందిన సర్వే నెంబర్లు 183 /పి , 184/పి, 187/పి , 188/ పి లో తాము చేపడుతున్న భవన నిర్మాణ పనులకు వి . సురేందర్ రెడ్డి, వి. మాధవరెడ్డి పీసరి మహేందర్ రెడ్డి అనే వ్యక్తులు తప్పుడు ఆరోపణలతో అడ్డంకులు కల్పిస్తున్నారని ల్యాండ్ మార్క్ వి లో నివాసముండే పి. ప్రతీష్ కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సదరు వ్యక్తులపై గతంలో కూడా పలు ఫిర్యాదులను త్రిపుర కన్స్ట్రక్షన్స్ చేసిందని , అయినప్పటికీ ఆ వ్యక్తులు రౌడీలతో వచ్చి పనులకు ఆటంకం కల్పిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నాడు. నిర్మాణ పనులు చేస్తున్న ఇన్చార్జిని తన కులం పేరుతో దూషిస్తూ నీ అంతు చూస్తామంటూ బెదిరించారని ఫిర్యాదులో తెలిపారు. అంతేకాకుండా సదరు వ్యక్తులు మిన్ను సింగ్ అనే వ్యక్తితో పాటు మరో 40 మంది కిరాయి రౌడీలతో వచ్చి పనిచేస్తున్న 12 మందిపై వెల్డింగ్ పరికరాలతో పాటు ఇతరత్రా వస్తువులతో దాడి చేసి గాయపరిచారని, దాంతో కార్మికులంతా అక్కడ నుంచి పారిపోయారని పేర్కొన్నారు. ఈ మేరకు ఫిర్యాదు అందుకున్న పోలీసులు రైతులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుతో పాటు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.
మాపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులా…?
మా స్థలంలోకి అక్రమంగా చొరబడుతూ మాపైనే తిరిగి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు నిర్మాణ సంస్థ బనాయించిందని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దొమ్మర పోచంపల్లికి చెందిన వంపుగూడెం సురేందర్ రెడ్డి గురువారం దుండిగల్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో అతని తల్లి కంసమ్మకు సర్వేనెంబర్ 183 లో 20 గుంటలు, సర్వేనెంబర్ 188 లో 24 గుంటల భూమి, అలాగే తమ బంధువు వంపు గూడెం కృష్ణారెడ్డికి సర్వేనెంబర్ 188 లో 1.13 ఎకరాల వ్యవసాయ భూమి ఉందని, దానిని వంశపారంపర్యంగా కొన్ని ఏళ్ల నుంచి సేద్యం చేస్తున్నారని తెలిపారు. సదరు స్థలానికి వేసిన ప్రహరీని పక్కనే నిర్మాణాలు చేపడుతున్న త్రిపుర భవన నిర్మాణ సంస్థ తమ స్థలాన్ని కూడా ఆక్రమించుకునేందుకు ప్రయత్నిస్తుందని ఫిర్యాదులో పేర్కొన్నారు. తమ స్థలంలోకి త్రిపుర సంస్థ వారు ఎస్సీ, ఎస్టీ వర్గానికి చెందిన కొంతమంది వ్యక్తులను తీసుకువచ్చి తమపై కేసులు బనాయించారని తెలిపారు. త్రిపుర సంస్థ ఎండి పసుపులేటి సుధాకర్ ప్రోద్బలం తో సంస్థ ప్రతినిధులు వెంకటేశ్వరరావు, సురేష్, ప్రత్యేష్, సాయి లు కర్రలు, ఇనుప రాడ్లతో అన్యాయంగా తమపై దాడికి దిగి భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. నిర్మాణ సంస్థ వారి నుంచి తమకు ప్రాణహాని ఉందని రక్షణ కల్పించాలని పోలీసులను కోరారు .