– వేగంగా వచ్చి లారీని ఢీకొన్న కారు
– ముగ్గురు విద్యార్థులు మృతి, ఇద్దరికి తీవ్ర గాయాలు
దుండిగల్ (న్యూస్ విధాత్రి), జూలై 19 : దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధి ఔటర్ రింగ్ రోడ్ ఎగ్జిట్ నెంబర్ 5 సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బౌరంపేట్ సర్వీస్ రహదారిలో అతివేగంతో కారు నడుపుతూ.. ఎదురుగా వస్తున్న లారీని ఢీ కొట్టడంతో ప్రమాదం సంభవించినట్లు సమాచారం.
స్కోడా కారు (టీఎస్ 08 జిఈ 0763)లో ప్రయాణిస్తున్న 5 మందిలో వీఎన్ఆర్ విజ్ఞాన్ జ్యోతి కళాశాల కు చెందిన ముగ్గురు విద్యార్థులు సంఘటన స్థలంలోనే మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. కారు నడుపుతున్న ఆకుల అక్షయ్ తో పాటు హరి, అస్మిత్, నవనీత్, జస్వంత్ ఉన్నారు. ప్రమాదంలో అక్షయ్, హరి, అస్మిత్ అక్కడికక్కడే మృతి చెందారు. గాయాల పాలైన ఇద్దరిని సమీపంలోని మల్లారెడ్డి ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. వీరంతా ఒకే హాస్టల్లో ఉంటూ విఎన్ఆర్ విజ్ఞాన జ్యోతి కళాశాలలో చదువుకుంటున్నట్లు సమాచారం.
కారు అతి వేగమే ప్రమాదానికి కారణంగా ప్రాథమిక దర్యాప్తులో పోలీసులు భావిస్తున్నారు. దీంతో కేసు నమోదు చేసుకున్న దుండిగల్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.