పండుగలను శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలి

~ బక్రీద్ దృష్ట్యా శాంతి సమావేశం నిర్వహించిన సూరారం పోలీసులు
~ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించే వారిపై కఠిన చర్యలు
~ ఊరేగింపులకు అనుమతులు తప్పనిసరి
కుత్బుల్లాపూర్ న్యూస్ విధాత్రి జూన్ 7 :  ప్రజలంతా పండుగలను శాంతియుత వాతావరణం లో జరుపుకోవాలని, రానున్న బక్రీద్ పండుగను దృష్టిలో పెట్టుకొని ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా, శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా జరుపుకోవాలని సూరారం ఇన్స్ పెక్టర్ ఏ. వెంకటేశం సూచించారు. సూరారం పోలీస్ స్టేషన్ లో వివిధ మతాలకు చెందిన వారితో ఆయన, ఎస్సై వెంకటేష్ తో కలిసి శాంతి సమావేశాన్ని (పీస్ కమిటీ మీటింగ్) శుక్రవారం నిర్వహించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రతి పండుగను స్నేహపూర్వక వాతావరణంలో జరుపుకోవాలని, ఇతరులను ఇబ్బంది పెట్టే విధంగా కానీ, ఇతర మతాలను కించపరిచే విధంగా కానీ ప్రవర్తించకూడదన్నారు. పెద్ద శబ్దాలతో మైకులు సౌండ్ బాక్సులు పెట్టకూడదని తెలిపారు. ర్యాలీలు, ఊరేగింపులు చేయాలనుకునేవారు పోలీసుల నుంచి తప్పనిసరిగా అనుమతులు తీసుకోవాలన్నారు. పండుగల సమయంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా మత పెద్దలు, కాలనీలు, బస్తీల సంక్షేమ సంఘాల సభ్యులు ప్రజలను చైతన్యపరచాలన్నారు. ఎటువంటి సమస్యలు తలెత్తిన తమ దృష్టికి తీసుకువచ్చి పరిష్కరించుకోవాలని తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అవసరం ఉన్నవారు ముందుగానే సమాచారం అందిస్తే బందోబస్తు ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఏవైన చిన్న చిన్న గొడవలు జరిగితే వాటిని భూతద్దంలో చూడకుండా సామరస్యంగా అక్కడికక్కడే పరిష్కరించుకోవాలని తెలిపారు. చట్ట పరిధిలో చట్టానికి లోబడి ప్రతి ఒక్కరు మసులుకోవాలని సిఐ సూచించారు.

Leave A Reply

Your email address will not be published.

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More