పరిష్కరించకుండానే.. పరిష్కరించామంటున్నారు
~ అక్రమ నిర్మాణాల ఆన్లైన్ ఫిర్యాదులపై టౌన్ ప్లానింగ్ అధికారుల తీరు ఇది
~ ఒకే అంశంపై పలుమార్లు ఫిర్యాదు చేసిన చర్యలు శూన్యం
కుత్బుల్లాపూర్ (న్యూస్ విధాత్రి ), అక్టోబర్ 30: అక్రమ నిర్మాణాల ఫిర్యాదులపై టౌన్ ప్లానింగ్ అధికారులు వింతగా ప్రవర్తిస్తున్నారు. అంతర్జాలం ద్వారా వచ్చిన ఫిర్యాదులను ఏమాత్రం పరిశీలించకుండా పరిష్కరించామని ఫిర్యాదులను క్లోజ్ చేస్తున్నారు. తిరిగి ఫిర్యాదును రి ఓపెన్ చేసినా యధాతధంగా అనాథరైజ్డ్ కన్స్ట్రక్షన్ ఇస్ రీ సాల్వెడ్ అనే మెసేజ్లు పంపిస్తున్నారు. ఇది కుత్బుల్లాపూర్ టౌన్ ప్లానింగ్ అధికారులు ఫిర్యాదులపై స్పందిస్తున్న తీరు.
పరిష్కరించకుండానే….
కుత్బుల్లాపూర్ డివిజన్ పద్మా నగర్ ఫేజ్ -2 లోని రోడ్ నెంబర్ – 15లో ఓ వ్యక్తి ఏమాత్రం సెట్ బ్యాక్ లు వదిలిపెట్టకుండా జి ప్లస్ నాలుగు అంతస్తుల
భవనాన్ని నిర్మిస్తున్నాడు. ఈ విషయమై ఆగస్టు నెల 14న ( ఫిర్యాదు సంఖ్య 1408233725195 ) ఫిర్యాదు చేశారు. దీనిని ఏమాత్రం పరిశీలించకుండా సాల్వుడు అని మెసేజ్లు పంపించారు. ఫిర్యాదు దారుడు ఇదే అంశంపై సెప్టెంబర్ 18న ( ఫిర్యాదు సంఖ్య ( 1809233882663 ) ఫిర్యాదు చేయగా పరిష్కరించామని క్లోజ్ చేశారు. తిరిగి ఇదే సెప్టెంబర్ 29న ఫిర్యాదు సంఖ్య (2909233930745 ) కంప్లైంట్ చేయగా అదే తీరును ప్రదర్శించారు కుత్బుల్లాపూర్ టౌన్ ప్లానింగ్ అధికారులు. అక్టోబర్ 9 నాడు మరోసారి ఫిర్యాదు సంఖ్య (910233974942) ఇదే అంశంపై ఫిర్యాదు చేశారు. అయినప్పటికీ సదరు భవనంపై పట్టణ ప్రణాళిక అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో ఫిర్యాదుదారుడు జిహెచ్ఎంసి కస్టమర్ కేర్ కు ఫోన్ చేసి సదరు విషయాన్ని వెల్లడించారు. దీనికి సమాధానంగా మరోమారు సోమవారం (29వ తేదీ) ఫిర్యాదు చేయవలసిందిగా వారు సూచించారు. దీంతో ఫిర్యాదుదారుడు ఇంకోసారి మై జిహెచ్ఎంసి యాప్ లో ఫిర్యాదు చేయగా రిఫరెన్స్ ఐడి సంఖ్య (3010234052310) తో ఫిర్యాదును నమోదైనట్లు మొబైల్ కు సందేశాన్ని పంపించారు. మరి…ఈసారైనా అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకుంటారో లేదో వేచి చూడాలి.
వచ్చిన ఫిర్యాదులైన పరిష్కరించరా..?
కుత్బుల్లాపూర్ సర్కిల్ పరిధిలో అనేక అక్రమ కట్టడాల పనులు కొనసాగుతూనే ఉన్నాయి. కొన్నింటిపై మాత్రమే ఫిర్యాదులు వస్తూ ఉంటాయి. అత్యల్పంగా వచ్చే ఫిర్యాదులపై కూడా టౌన్ ప్లానింగ్ అధికారులు స్పందించని తీరు చూస్తుంటే వారి పనితనం ఇట్టే అర్థం అవుతుంది.
కేవలం ఆన్లైన్ ద్వారా వచ్చే భవన నిర్మాణాల కోసం దరఖాస్తులు పరిశీలించి అనుమతులు ఇవ్వడం తప్పితే మరొక పని వారు చేసినట్టు కనిపించడం లేదు. వచ్చిన ఫిర్యాదులలో కనీసం వాటికి కూడా స్పందించకుండా “వచ్చామా…పోయామా” అన్న తీరుగా వ్యవహరిస్తున్నారు టౌన్ ప్లానింగ్ అధికారులు.