ప్రారంభమైన ప్రధాన ఘట్టం… తొలి రోజు నమోదుకాని నామినేషన్
కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో తొలిరోజు నామినేషన్లు శూన్యం
ఎన్నికల నోటిఫికేషన్ (ఫారం -1) ను విడుదల చేసిన ఆర్వో సైదులు
ఆర్వో కార్యాలయానికి 150 మంది పోలీసులతో రక్షణ కవచం
బందోబస్తును పరిశీలించిన మేడ్చల్ డిసిపి శబరీష్
కుత్బుల్లాపూర్ (న్యూస్ విధాత్రి), నవంబర్ 3: ఎన్నికల్లో ప్రధాన ఘట్టమైన నామినేషన్ల ప్రక్రియ శుక్రవారం ప్రారంభమైంది . కుత్బుల్లాపూర్ నియోజకవర్గానికి సంబంధించి ఫారం-1 ను ఎన్నికల అధికారి పులి సైదులు, ఏఆర్వోలతో కలిసి ఆర్వో కార్యాలయంలో విడుదల చేశారు. నామినేషన్ల ప్రక్రియ మొదలైన మొదటి రోజు నియోజకవర్గంలో ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాలేదు. నియోజకవర్గ పరంగా ఇప్పటివరకు 13 మంది నామినేషన్ దరఖాస్తు పత్రాలను తీసుకెళ్లిన ఒకటి కూడా నమోదు కాకపోవడం తో నియోజకవర్గంలో తొలిరోజు ‘సున్నా ‘ రాజ్యం ఏలింది.
రిటర్నింగ్ కార్యాలయానికి కట్టుదిట్టమైన భద్రత…
నామినేషన్ల ఘట్టం ప్రారంభమైన నేపథ్యంలో కుత్బుల్లాపూర్ రిటర్నింగ్ కార్యాలయం వద్ద సుమారు 150 మంది రక్షక బటు లతో రక్షణ కవచనాన్ని ఏర్పాటు చేశారు. కార్యాలయ ప్రధాన ద్వారానికి ఇరువైపులా 100 మీటర్ల దూరం లో ఒకవైపు కుత్బుల్లాపూర్ కూడలి అంబేద్కర్ విగ్రహం వద్ద, మరోవైపు కుత్బుల్లాపూర్ ప్రధాన రహదారి బీరప్ప నగర్ మూలమలుపు వద్ద బారికేడ్లు ఏర్పాటు చేసి 144 సెక్షన్ విధించారు. ఈ ఏర్పాట్లను మేడ్చల్ డిసిపి శబరీష్ పరిశీలించారు. సిఐఎస్ఎఫ్, రిజర్వుడు, స్పెషల్ పార్టీ, సివిల్ పోలీసులు లతో బందోబస్తు ఏర్పాటు చేసినట్లు బాలానగర్ ఎసిపి గంగారం తెలిపారు.
25 నుంచి 30 నామినేషన్లు వస్తాయని అంచనా… నామినేషన్లను దృష్టిలో పెట్టుకొని ఈ ఎన్నికల్లో కూడా సుమారు 25 నుంచి 30 నామినేషన్లు దాఖలు అయ్యే సూచనలు కనిపిస్తున్నాయని పలువురు చర్చించుకుంటున్నారు. 2018 ఎన్నికలలో మొత్తం 28 నామినేషన్లు దాఖలు కాగా వాటిలో 26 మంది నామినేషన్లు పురుషులు వేయగా, రెండు నామినేషన్లను మహిళలు వేశారు. వీటిలో 11 నామినేషన్లు తిరస్కరణకు గురికాగా, రెండు నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. దీంతో మొత్తంగా 15 మంది అభ్యర్థులు చివరిగా గత ఎన్నికల బరీలో నిలిచారు.