భూకబ్జాకోరుల నుంచి శిఖం కుంట చెరువును కాపాడాలని కలెక్టరేట్లో ఫిర్యాదు
✓ పలుమార్లు ఫిర్యాదు చేసిన పట్టించుకోని తాసిల్దార్, పట్టణ ప్రణాళిక అధికారులు
✓సర్వే నెంబర్లు మార్చి నకిలీ దస్తావేజులు సృష్టిస్తున్న భూకబ్జాదారులు
✓చెరువు కబ్జాకు గురైతే ముంపు తప్పదని ఫిర్యాదులో పేర్కొన్న బస్తివాసులు
గాజులరామారం న్యూస్ విధాత్రి అక్టోబర్ 28: శిఖం కుంట చెరువులో భూ ఆక్రమణదారులు చేస్తున్న నిర్వాకం, అధికారుల నిర్లక్ష్యం వల్ల తమ బస్తీలు వర్షాకాలంలో ముంపుకు గురయ్యే ప్రమాదం ఉందని కృష్ణానగర్, సోనియా గాంధీ నగర్ బస్తీ వాసులు వాపోతున్నారు. గాజులరామారం గ్రామం సర్వేనెంబర్ 23 లోని కృష్ణ నగర్ లోని శిఖం కుంట చెరువును గత కొన్ని ఏళ్ల నుంచి కొందరు భూకబ్జాదారులు కుంటస్థలాన్ని ఆక్రమించి మట్టితో పూడ్చి ఇష్టానుసారం ఇళ్ల నిర్మాణాలు చేపడుతున్నారు. ఇదే విషయంపై ఈనెల 12వ తేదీన మేడ్చల్ జిల్లా కలెక్టరేట్లో ఆయా బస్తీలవాసులు ఫిర్యాదును అందజేశారు.
సర్వేనెంబర్ 23 పూర్తిగా ప్రభుత్వ స్థలం అయినప్పటికీ తహసిల్దార్, పట్టణ ప్రణాళిక అధికారులు కబ్జాకోరులు ఆక్రమణలకు పాల్పడుతున్న పట్టించుకోకపోగా.. తాము ఫిర్యాదు చేసినా స్పందించే స్థితిలో వారు లేరని ఫిర్యాదులో పేర్కొన్నారు. అధికారులు భూకబ్జాదారులపై తగిన చర్యలు తీసుకోకపోవడంతో వారు పదేపదే కబ్జాలకు పూనుకోవడం వారిపై తాము ఫిర్యాదులు చేయడంతోనే సరిపోతుందని విమర్శించారు. సర్వేనెంబర్ 23 ప్రభుత్వ స్థలాన్ని సర్వేనెంబర్ 22 గా చూపిస్తూ అటు అధికారులను, ఇటు ప్రజలను మోసం చేస్తూ నకిలీ దస్తావేదులు సృష్టించి భూకబ్జాలు చేస్తున్న వేమన రెడ్డి, ఈశ్వర్ రెడ్డి, మజూర్ ఖాన్, కృష్ణారెడ్డి, మహమూద్, కైసర్ ఇంకా కొంతమంది కబ్జాదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో కోరారు.