వ్యాపారంలో నష్టపోయి సరైన ఉద్యోగం లేక యువకుడు ఆత్మహత్య
కుత్బుల్లాపూర్ (న్యూస్ విధాత్రి), జూన్ 6: వ్యాపారంలో నష్టపోవడమే కాకుండా సరైన ఉద్యోగం కూడా లేక ఆర్థిక ఇబ్బందులు పడుతున్న ఓ యువకుడు మనస్థాపానికి గురై ఆత్మహత్య చేసుకున్న సంఘటన పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… కుత్బుల్లాపూర్ డివిజన్ పరిధి శ్రీరామ్ నగర్ కాలనీకి చెందిన గురునాథం కుమారుడు జాస్తి మని సాయి (25) స్క్రాప్ వ్యాపారం చేస్తూ తనకు వరుసకు సోదరుడైన పాండురంగబాబుతో కలిసి అద్దె ఇంట్లో ఉంటూ జీవనం సాగిస్తున్నాడు. గురువారం పాండురంగబాబు, మని సాయికి ఫోన్ చేయగా స్విచ్ ఆఫ్ అని వచ్చింది. దీంతో అతను ఇంటికి వచ్చి చూడగా మని సాయి కింద పడిపోయి అపస్మారక స్థితిలో పడి ఉండడాన్ని గమనించాడు. వెంటనే అతని ని పరీక్షించగా చనిపోయినట్లు నిర్ధారణకు వచ్చిన పాండురంగబాబు పక్కనే ఉన్న సూసైడ్ నోట్ ను చదివి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. తన తమ్ముడు వ్యాపారంలో నష్టపోవడమే కాక సరైన ఉద్యోగం లేక మనస్థాపానికి గురై ఆత్మహత్య చేసుకొని ఉంటాడని ఫిర్యాదు చేశాడు. దీంతో కేసు నమోదు చేసుకున్న పేట్ బషీరాబాద్ పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించి దర్యాప్తు చేస్తున్నారు.