సమస్యల పరిష్కారానికి నిరసనగా నామినేషన్ దాఖలు చేయనున్న సూపర్ మ్యాక్స్ ఉద్యోగులు
కుత్బుల్లాపూర్ (న్యూస్ విధాత్రి), నవంబర్ 7: తాము పని చేస్తున్న పరిశ్రమలో తమ సమస్యలు పరిష్కరించకుండా పరిశ్రమను మూసివేయడంపై జీడిమెట్ల పారిశ్రామిక వాడలోని సూపర్ మ్యాక్స్ ఉద్యోగులు వినూత్న రీతిలో నిరసన తెలిపేందుకు సిద్ధమయ్యారు. దీనికి నిరసనగా 1350 మంది ఉద్యోగులు ఉన్న పరిశ్రమలో సుమారు 200 మంది రానున్న ఎన్నికల్లో నామినేషన్లు దాఖలు చేయడానికి ముందుకు వస్తున్నారు. ఈ మేరకు మంగళవారం కుత్బుల్లాపూర్ ఆర్వో కార్యాలయంలో నామినేషన్ దరఖాస్తులను పొందేందుకు సుమారు 50 మంది ఉద్యోగులు ఒక్కసారిగా చేరుకున్నారు. ఆర్ ఓ కార్యాలయం వద్ద 144 సెక్షన్ అమల్లో ఉండడం వల్ల పోలీసులు వారిని అడ్డుకొని ఐదు ఐదు మంది చొప్పున విడతల వారీగా లోపలికి పంపించారు. ఈ రకంగా మొత్తం 36 మంది మంగళవారం నామినేషన్ దరఖాస్తు పత్రాలను పొందారు. మొత్తం 200 మంది వరకు నామినేషన్లు దాఖలు చేస్తామని వారు తెలిపారు. గత 18 మాసాలుగా తమకు పరిశ్రమ యాజమాన్యం జీతాలు చెల్లించకుండా, వారి సమస్యలు పరిష్కరించకుండా, పరిశ్రమ మూసివేయడంపై లేబర్ కమిషనర్, కార్మిక శాఖ మంత్రి, స్థానిక ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే తో పాటు వివిధ రాజకీయ పార్టీల నాయకులను ఆశ్రయించామని, అయినా ఫలితం లేకపోవడంతో ఈ రకంగా వారి నిరసనను వ్యక్తం చేస్తున్నామని తెలిపారు.