27 తులాల బంగారం, 50 తులాల వెండి ఆభరణాలు, రూ 1,30,000 నగదు స్వాధీనం..
పేట్ బషీరాబాద్ (న్యూస్ విధాత్రి), సెప్టెంబర్ 20: తాళం వేసి ఉన్న ఇళ్లలో చోరీలకు పాల్పడుతున్న పాత నేరస్తుడిని అరెస్ట్ చేసిన సంఘటన అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఈ మేరకు మేడ్చల్ డీసీపీ కార్యాలయంలో బుధవారం డీసీపీ శబరీష్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించారు.
కర్ణాటక రాష్ట్రం హల్లిసల్గర్, గుల్బర్గాలోని కంసర్ నాయక్ తండా ప్రాంతానికి చెందిన గులాబ్ గంగారామ్ చవాన్ (34 ) కూలి పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఇటీవల అతని ఆరోగ్యం సరిగా లేక చికిత్స నిమిత్తం హైదరాబాద్ నగరానికి వచ్చి అల్వాల్ పరిధి మచ్చ బొల్లారంలోని హనుమన్ తాకిడి ప్రాంతంలో నివాసం ఉంటున్నాడు. గంగారాం చుట్టుపక్కల కూలి పనుల నిమిత్తం బయటకు వెళ్లి రెక్కీ నిర్వహించి తాళాలు వేసి ఉన్న ఇళ్లను టార్గెట్ చేసి దొంగతనాలు చేసేవాడు. ఇటీవల తాను అల్వాల్ రైల్వే ట్రాక్ సమీప ప్రాంతాల్లో పలు ఇళ్లలో, మచ్చ బొల్లారం పిఎస్ పరిధిలో రెండు నెలలలో 8 దొంగతనాలకు పాల్పడ్డాడు. ఈ మేరకు వచ్చిన ఫిర్యాదులను సవాల్ గా తీసుకున్న అల్వాల్ పోలీసులు ఏసిపి రఘునందన్ రావు పర్యవేక్షణలో అల్వాల్ ఇన్స్పెక్టర్ ఉపేందర్, డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ ప్రమోద్ కుమార్ బుధవారం అనుమానాస్పదంగా తిరుగుతున్న గులాబ్ గంగారం చౌహాన్ ను అదుపులోకి తీసుకొని విచారించగా తాను పలు దొంగతనాలు చేసినట్లు అంగీకరించాడు.
అల్వాల్ పీఎస్ పరిధిలో 6, మచ్చ బొల్లారం పిఎస్ పరిధిలో రెండు దొంగతనాలు చేసినట్లు ఒప్పుకున్నాడు. కర్ణాటక రాష్ట్రంలో కూడా అతను 9 దొంగతనాలలో నిందితుడిగా ఉన్నట్లు విచారణలో తేలింది. అతని వద్ద నుండి 27 తులాల బంగారం, 50 తులాల వెండి, రూ1,30,000 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఆభరణాల విలువ సుమారు17,85,000 ఉంటుందని అంచనా వేస్తున్నారు.