అనుమతులు లేని శ్రీ చైతన్య పాఠశాలను వెంటనే మూసివేయాలి
~ రాస్తారోకో చేసి ప్రధాన రహదారిపై బైఠాయించిన బడ్జెట్ పాఠశాలల కరస్పాండెంట్లు
~ ఆత్మహత్య కేంద్రాలు మాకొద్దంటూ నినాదాలు
కుత్బుల్లాపూర్ (న్యూస్ విధాత్రి), జూన్ 19: పెద్ద చేపలు వచ్చి చిన్న చేపలు మింగినట్లుగా శ్రీ చైతన్య పాఠశాలల వైఖరి ఉందని బడ్జెట్ పాఠశాలల యాజమాన్యం మండిపడ్డారు. కుత్బుల్లాపూర్ సర్కిల్ పరిధి సుచిత్ర సమీపంలో ఎటువంటి అధికారిక అనుమతులు పొందకుండా నిబంధనలకు విరుద్ధంగా ఏర్పాటు చేస్తున్న శ్రీ చైతన్య పాఠశాలను వెంటనే మూసివేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు శ్రీ చైతన్య పాఠశాల వద్ద పెద్ద ఎత్తున రాస్తారోకో నిర్వహించి, ప్రధాన రోడ్డుపై బుధవారం బైఠాయించారు. బట్టి కొట్టే విధానం, ఆటపాటలు లేని చదువు, ఆత్మహత్యలకు కేంద్రాలుగా ఉన్న పాఠశాలలు, విద్యార్థులను మరమనుషులుగా చేసే పాఠశాలలో మాకొద్దని ప్ల కార్డులతో నిరసన తెలిపారు. శ్రీ చైతన్య డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో సుమారు వంద మంది బడ్జెట్ పాఠశాలల కరస్పాండెంట్లు, యాజమాన్యాలు పాల్గొన్నారు.