అబ్బాయిపై బాబాయ్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు.
- ఎమ్మెల్యే ఏపీ వివేకానంద్ తనపై చేసిన భౌతిక దాడి కారణంగా ఫిర్యాదు చేసిన మాజీ ఎమ్మెల్యే, బిజెపి అభ్యర్థి శ్రీశైలం గౌడ్.
- ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తే దాడి చేస్తారా… అని మండిపాటు.
- ముందుగానే పోలీస్ అధికారులకు చెప్పిన పట్టించుకోలేదు
- పోలీసులు బీఆర్ఎస్ పార్టీకి తొత్తులుగా వ్యవహరిస్తున్నారు…
కుత్బుల్లాపూర్ (న్యూస్ విధాత్రి), అక్టోబర్ 26 : ఓ ఛానల్ డిబేట్లో బుధవారం కుత్బుల్లాపూర్ లో నిర్వహించిన గెలుపు ఎవరిదీ? కార్యక్రమంలో ప్రజా సమస్యలు లేవనెత్తితే తనపై ఎమ్మెల్యే, బీఆర్ఎస్ అభ్యర్థి కెపి వివేకానంద్ దాడి చేశాడంటూ సూరారం పోలీస్ స్టేషన్ లో మాజీ ఎమ్మెల్యే, బిజెపి అభ్యర్థి కూన శ్రీశైలం గౌడ్ గురువారం ఫిర్యాదు చేశారు. శ్రీశైలం గౌడ్ కు మద్దతుగా వేలాదిగా బిజెపి శ్రేణులు అభిమానులు పోలీస్ స్టేషన్ కు తరలివచ్చారు. ఇదే విషయంపై సూరారం పోలీస్ స్టేషన్ వద్ద బుధవారం అర్థ రాత్రి వరకు ఉత్కంఠ కొనసాగింది. ఈ సందర్భంగా కూన శ్రీశైలం గౌడ్ మాట్లాడుతూ కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేక్ నాపై చేసిన భౌతిక దాడి కుత్బుల్లాపూర్ ప్రజలంతా చూశారన్నారు.
ఓడిపోతాననే అభద్రతాభావంతోనే….
ఓడిపోతాననే భయంతోనే ముందస్తు పథకం ప్రకారం ఎమ్మెల్యే తనపై దాడి చేసాడన్నారు. దాడి చేస్తారనే విషయాన్ని సీఐ, డీసీపీకి ముందే చెప్పిన పట్టించుకోలేదాని, పోలీసులు బీఆర్ఎస్ పార్టీ కి తొత్తుల్లా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. బందోబస్త్ పెట్టమని పోలీసులకు ముందే చెప్పిన పట్టించుకోకపోవడానికి గల కారణం ఏంటో చెప్పాలని ప్రశ్నించారు. పోలీసులు గులాబీ కండువా కప్పుకున్నట్లు వ్యవహరిస్తున్నారని విమర్శించారు. బిజెపి కార్యకర్తలను, నాయకులను కొడుతున్న పోలీసులు చూస్తున్నారే తప్ప వారిపై ఎటువంటి చర్యలు తీసుకోలేదని అన్నారు. పోలీసులు ఇలాగే వ్యవహరిస్తే భవిష్యత్తులో కోర్టులు చుట్టూ తిరగాల్సిన పరిస్థితి వస్తుందని గుర్తు చేశారు. బీజేపీ కార్యకర్తలు, అభిమానులు ఎవరు సహనం కోల్పోవద్దని, చట్టం తన పని తాను చేసుకుపోతుందని పిలుపునిచ్చారు.
కుత్బుల్లాపూర్ ప్రజలే ఇటువంటి రౌడీకి తగిన బుద్ది చెప్తారన్నారు.