అభివృద్ధిని చూసి ఓటు వేయాలి. – ఎమ్మెల్యే వివేకానంద్
కుత్బుల్లాపూర్ న్యూస్ విధాత్రి నవంబర్ 9: కుత్బుల్లాపూర్ నియోజకవర్గం ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ గురువారం బిఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. ఈ మేరకు ఆయన కుత్బుల్లాపూర్ రిటర్నింగ్ కార్యాలయంలో నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారి పులి సైదులుకు అందజేశారు. అంతకుముందు ఆయన సూరారం కట్ట మైసమ్మ ఆలయంలో నామినేషన్ పత్రాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అనంతరం అక్కడనుండి భారీ ర్యాలీగా బయలుదేరి రిటర్నింగ్ కార్యాలయానికి చేరుకున్నారు. అక్కడ నామినేషన్ పత్రాలను నమోదు చేశారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ వేలాదిగా తరలివచ్చిన బిఆర్ఎస్ అభిమానులు, కార్యకర్తలు, పార్టీ శ్రేణులను చూస్తుంటే ప్రత్యర్థి పార్టీ అభ్యర్థులకు ఓటమి భయం పట్టుకుందని అన్నారు.
జాతీయ పార్టీలు అని చెప్పుకునే కాంగ్రెస్, బిజెపి పార్టీలు కులం పేరుతో మతం పేరుతో ప్రజల మధ్యలో గొడవలు సృష్టించి ఓట్లు అడగడానికి వస్తున్నాయన్నారు. కావున అటువంటి వారిని నమ్మొద్దని ప్రజలను కోరారు. బిఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి నియోజకవర్గంలో ఎటు పోయిన కనిపిస్తుందని పేర్కొన్నారు. కావున అభివృద్ధిని చూసి మాత్రమే ఓటు వేయాలని కల్లబొల్లి మాటలు చెప్పే వారిని నమ్మొద్దని ఎమ్మెల్యే కెపి వివేకానంద సూచించారు.