అర్ధరాత్రి దాడి దోపిడీల నిందితులు అరెస్ట్… రిమాండ్ కు తరలింపు
~ దారి దోపిడీలో ఆరుగురు నిందితులు
~ నిందితుల్లో ఇద్దరు పాత నేరస్తులు
~ ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు
కుత్బుల్లాపూర్ (న్యూస్ విధాత్రి), జూన్ 1 : మద్యం మత్తులో ఆకతాయిలు అర్ధరాత్రి క్యాబ్ ను అడ్డగించి, డ్రైవర్ పై దాడి చేసి సాఫ్ట్ వేర్ ఉద్యోగుల వద్ద దోపిడీకి పాల్పడిన నిందితులను జీడిమెట్ల పోలీసులు అరెస్టు చేసి శుక్రవారం రిమాండ్ కు తరలించారు. జీడిమెట్ల పిఎస్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో బాలానగర్ ఎసిపి హనుమంతరావు కేసు వివరాలను తెలిపారు. సదరు సంఘటనలో 6 మంది నిందితులు ఉన్నారు. వారిలో సంజయ్ గాంధీ నగర్ కు చెందిన ఏ1 మహమ్మద్ మాజీద్ అలియాస్ మున్నా (24), ఏ2 అన్నారం అఖిల్ (24), నెహ్రూ నగర్ కు చెందిన ఏ3 టి రాజా సింగ్ (30), రోడా మేస్త్రి నగర్ కు చెందిన ఏ4 డి కార్తీక్ (19), ఏ5 సిహెచ్. చందు (22), షాపూర్ నగర్ కు చెందిన ఏ6 మాగ్దల్ చింటూ (21) ఉన్నారు. వీరిలో ఏ1, ఏ2 పలు కేసులలో పాత నేరస్తులు. వీరంతా కలిసి గురువారం అర్ధరాత్రి 2.30 గంటలకు కారు డ్రైవర్ అనిల్ (24) తన క్యాబ్ లో ఇద్దరు సాఫ్ట్ వేర్ ఉద్యోగులను మాదాపూర్ నుంచి జీడిమెట్ల పిఎస్ పరిధిలోని నెహ్రూ నగర్ కు తీసుకు వెళ్తున్నాడు. ఈ క్రమంలో నెహ్రూ నగర్ ప్రధాన రహదారికి చేరుకోగానే నిందితులు మద్యం మత్తులో క్యాబ్ ను అడ్డగించి ఉద్యోగుల వద్ద డబ్బు డిమాండ్ చేశారు. వారి వద్ద నుంచి సెల్ ఫోన్లు, కొంత నగదును లాక్కున్నారు. అంతేకాకుండా డ్రైవర్ మెడపై బ్లేడుతో దాడి చేసి గాయపరిచారు. నిందితులు ఆరుగురు అక్కడి నుంచి బాలానగర్ వైపు రెండు ద్విచక్ర వాహనాలపై వెళ్లి అక్కడ ఓ పెట్రోల్ బంక్ లో ద్విచక్ర వాహనానికి పెట్రోల్ కొట్టించుకున్న ఓ జంటపై దాడి చేసి వారి ద్విచక్ర వాహనాన్ని కూడా లాక్కొని పారిపోయారు. దీంతో ఆ జంట డయల్ 100కు ఫోన్ చేయడంతో బాలానగర్ పెట్రోలింగ్ సిబ్బందికి వారిని వెంబడించి ఇద్దరు నిందితులను పట్టుకున్నారు. దీంతో మరో నలుగురు నిందితులు భయంతో జీడిమెట్ల వైపు వస్తుండగా సమాచారం అందుకున్న జీడిమెట్ల పోలీసులు వారిని పట్టుకుని అదుపులోకి తీసుకున్నారు. బాలానగర్ పోలీసులు పట్టుకున్న ఇద్దరు నిందితులను కూడా జీడిమెట్ల పోలీసులకు అప్పగించారు. వీరి వద్ద నుంచి ద్విచక్ర వాహనాన్ని (TS 07 KF 6616) పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సమావేశంలో జీడిమెట్ల సిఐ శ్రీనివాసరావు, డి ఐ విజయ నాయక్, ఎస్ఐ ఆంజనేయులు, సిబ్బంది పాల్గొన్నారు.