అసలే వివాదస్పద స్థలం… ఆపై అక్రమ నిర్మాణం…
• కూల్చేందుకు వెళ్లిన అధికారులు.. ఆడ్డుకున్న నిర్మాణదారులు
• అధికారులు, నిర్మాణదారుల మధ్య వాగ్వాదం నెలకొన్న రసాభాస
• పెట్రోల్ సీసా పట్టుకొని పోసుకుంటామని బెదిరింపులు
• కోర్టు ఆర్డర్ సైతం భేఖాతరు
• స్పృహ తప్పి పడిపోయిన మహిళ
• రెండు రోజల గుడువు పెట్టి వెనుతిరిగిన అధికారులు
కుత్బుల్లాపూర్ (న్యూస్ విధాత్రి), జూలై 8: వివాదాస్పద స్థలంలో నిర్మించిన ఓ ఆక్రమ నిర్మాణం తొలగింపు విషయంలో అధికారులు, నిర్మాణదారులకు మధ్య వాగ్వాదం తారా స్థాయికి చేరుకొని మంగళవారం రసాభాస ఏర్పడింది. సుభాష్ నగర్ డివిజన్ పరిధి సూరారం కాలనీ ఓం జెండా సమీపంలో 70 గజాల స్థలం ఉంది. సదరు స్థలం రజిత పేరుపై ఒకసారి, ఎండీ మహమ్మద్ పేరుపై మరోసారి డబుల్ రిజిస్ట్రేషన్ కావడంతో వివాదాస్పదంగా మారింది. ఇరు వర్గాల మధ్య సదరు స్థల విషయంలో ఎప్పటి నుండో వాదోపవాదాలతో పాటు వివాదం కోర్టుకు చేరింది. దీంతో సదరు స్ధలం రజితకు చెందుతుందని కోర్టు ఆర్డర్ కూడా వచ్చింది కానీ..ఎండీ మహమ్మద్ కోర్టు ఆర్డర్ ను కూడా లెక్క చేయకుండా ఆ స్థలంలో అధికారుల నుంచి ఎటువంటి నిర్మాణ అనుమతులు పొందకుండా నిబంధనలకు విరుద్ధంగా గ్రౌండ్ తో పాటు రెండు పై అంతస్తుల భవనాన్ని నిర్మించాడు. కోర్టు ఆర్డర్ ఆధారంగా జీహెచ్ఎంసీ కుత్బుల్లాపూర్ సర్కిల్ పట్టణ ప్రణాళికా అధికారులు సూరారం పోలీసుల సహాయంతో ఆక్రమ నిర్మాణాన్ని కూల్చేందుకు ప్రాక్లెయినర్ తో అక్కడికి చేరుకున్నారు.
• విధులను అడ్డుకొని… బెదిరింపులు…
ఆక్రమ నిర్మాణం వద్దకు చేరుకొన్న అధికారులను, పోలీసులను మహమ్మద్ వర్గీయులు ఒక్కసారిగా గుమ్మికూడి విధులకు అడ్డంకి కలిగించడంతో పాటు బెదిరింపులకు పాల్పడ్డారు. ఆంతేకాకుండా పట్టణ ప్రణాళికా ఏసీపీ సాయిబాబాను సిబ్బందిని చుట్టు ముట్టారు. దీంతో ఆ ప్రాంతమంతా గందరగోల పరిస్థితి నెలకొంది. అనంతరం సదరు భవనం లోపలికి వెళ్లిన మహమ్మద్ కుటుంబ సభ్యులు లోపలి నుంచి తలుపులకు గడియ పెట్టుకొని అదికారులను రానివ్వకుండా మొదటి అంతస్తు బాల్కాని నుంచి దుర్భాషలాడుతూ ఆక్రమ నిర్మాణాన్ని కూల్చితే తమ పై పెట్రోల్ పోసుకొని చనిపోతామని, పెట్రోల్ సీసాను చేతులో పట్టుకొని బెదిరింపులకు పాల్పడ్డారు. అనంతరం పెట్రోల్ సీసాలోని పెట్రోల్ ను పై నుంచి అధికారులపై కూడా చల్లడం ప్రారంభించారని ఓ అధికారి తెలిపారు. అలాగే మహమ్మద్ కుటుంబానికి చెందిన ఓ మహిళ స్పృహ తప్పి పడిపోవడంతో ఆమెను ఆసుపత్రికి తరలించారు. అనంతరం ఆక్రమ నిర్మాణదారుల తరపు న్యాయవాది అధికారులతో మాట్లాడి వారం రోజులు గడువు ఇవ్వాలని, సదరు స్థలానికి చెందిన తమ సరైన పత్రాలు చూపిస్తామని తెలపడంతో కుదరదని రెండు రోజులు మాత్రమే గడువును అధికారులు ఇచ్చి అక్కడి నుంచి వెనుతిరిగారు.
• సుభాష్ నగర్ లోని గంపలబస్తీలో కూల్చివేతలు…
సుభాష్ నగర్ డివిజన్ పరిధి గంపలబస్తీలో ఓ భవనంపై నిర్మిస్తున్న ఆక్రమ అంతస్తును (పెంట్ హౌస్) ఉప కమిషనర్ వి. నర్సింహ ఆధ్వర్యంలో పట్టణ ప్రణాళిక ఆదికారులు కూల్చివేశారు. అంజన్ కుమార్ మండల్ అండ్ ఇతరుల పేరుపై సుమారు 220 గజాల్లో గ్రౌండ్ ఫ్లోర్ తో పాటు రెండు పై అంతస్తులకు అనుమతులు పొందారు. అనుమతులకు మించి మరో అంతస్తును అక్రమంగా నిర్మించడంతో ఫిర్యాదులు అందుకున్న అధికారులు సదరు అదనపు అంతస్తును కూల్చివేశారు. సర్కిల్ పరిధిలో ఆక్రమ నిర్మాణాలను, ఆక్రమంగా నిర్మించే ఆదనపు అంతస్తులను ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదని, అనుమతులకు లోబడే నిర్మాణాలను చేపట్టాలని డీసీ నర్సింహా సూచించారు.