ఆశా వర్కర్ల సమస్యలపై అసెంబ్లీలో ప్రస్తావిస్తా
– కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు
కూకట్ పల్లి (న్యూస్ విధాత్రి), జూలై 18 : ఆశ వర్కర్లు ఎదుర్కొంటున్న సమస్యలపై అసెంబ్లీలో ప్రస్తావించి వారి సమస్యలను పరిష్కరించే విధంగా కృషి చేస్తానని కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు హామీ ఇచ్చారు. ఈ మేరకు ఆశ వర్కర్లు వారు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రస్తావిస్తూ కూకట్ పల్లి ఎమ్మెల్యే కార్యాలయంలో గురువారం ఆయనకు వినతి పత్రాన్ని అందజేశారు. ఆశ వర్కర్లను కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవటం లేదని, ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చి తమ సమస్యలను పరిష్కరించాల్సిందిగా వినతి పత్రంలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మాజీ మంత్రి హరీష్ రావు దృష్టికి తీసుకువెళ్లి అసెంబ్లీలో ప్రస్తావిస్తానని హామీ ఇచ్చారు. ఆశ వర్కర్ల సమస్యలపై స్పందించాలని రాబోయే అసెంబ్లీ సమావేశాలలో ఈ సమస్యను ప్రస్తావిస్తూ ప్రభుత్వాన్ని నిలదీయాలని కోరుతూ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు లేఖ రాయడంతో పాటుగా దానిని మాజీ మంత్రి హరీష్ రావుకు అందజేశారు.