ఆసలును పోలిన నకిలీ మాత్రల తయారీ రాకెట్ గుట్టు రట్టు

> ఎస్ వో టీ, పోలీసులు, ఔషధ నియంత్రణ ఆధికారలు సంయుక్త దాడి
> ఆబాట్, కాడిలా సంస్థలకు చెందిన మందుల నకిలీలు
> దూలపల్లిలో గుట్టుగా తయారీ
> రూ.23 లక్షల నకిలీ మందులు… రూ. 25 లక్షల యంత్రాలు, పరికరాలు స్వాధీనం
> ఇద్దరు నిందితులు ఆదువులో ఒక నిందితుడు పరారీలో..
కుత్బుల్లాపూర్ (న్యూస్ విధాత్రి), జూలై 4 :  అవి పేరుకే నకిలీ మందులు (ఔషధాలు)… కానీ అసలు మందులకు ఏ మాత్రం తీసిపోకుండా కనిపిస్తాయి. ఔషధ నిపుణులు కూడా ఓ పట్టాన గుర్తించలేరంటే.. ఇక సామాన్యుల పరిస్థితి సరేసరి. మందుల రంగుల్లో, బార్ కోడ్ లతో పాటు గుర్తించలేని స్వల్ప మార్పులతో సంబంధిత అధికారుల నుంచి ఎటువంటి అనుమతులు పొందకుండానే నకిలీ మందులను తయారు చేసి మార్కెట్లోకి వదులుతూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు కేటుగాళ్లు. ఏకంగా మార్కెట్ లో మనుగడలో ఉన్న ఎం ఎన్ సి (మల్టీ నేషనల్ కార్పొరేషన్) మందులను యధావిధిగా తయారు చేసి వినియోగదారులను మభ్యపెడుతున్నారు. ఆచ్చంగా ఇలాంటి నకిలీ మందులు తయారు చేస్తున్న దూలపల్లిలోని ఓ స్థావరంపై మేడ్చల్ ఎస్ వోటీ పోలీసులు, ఔషధాల నియంత్రణ సిబ్బంది (డ్రగ్స్ కంట్రోల్ ఆడ్మినిస్ట్రేషన్), పేట్ బషీరాబాద్ పోలీసులు సంయుక్తంగా బుధవారం దాడి చేసి నకిలీ మందుల రాకెట్ గుట్టు రట్టు చేశారు. దీనికి సంబంధించి మేడ్చల్ జోన్ డీసీపీ ఎన్. కోటిరెడ్డి పేట్ బషీరాబాద్ పీఎస్ లో విలేకరుల సమావేశాన్ని గురువారం ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించారు.

అసలు, నకిలీలలో బార్ కోడ్ ల వ్యత్యాసం

• వివరాల ప్రకారం…                                                               కొంపల్లి మున్సిపల్ పరిధి దూలపల్లిలోని సెయింట్ మార్టిన్ కళాశాలకు సమీపంలో ఓ స్థావరంలో ప్రముఖ పార్మా పరిశ్రమలకు చెందిన నకిలీ మందులను గుట్టుగా తయారు చేస్తున్నారు. సమాచారం మేరకు సదరు స్థావరంపై పోలీసులు దాడి చేయగా ఎటువంటి అనుమతులు పొందకుండా నిబంధనలకు విరుద్ధంగా ఎం ఎన్ సి పరిశ్రమలైన   అబాట్, కాడిలా సంస్థలకు చెందిన మందులకు నకిలీలను రహస్యంగా తయారు చేస్తున్నట్లుగా వారు గుర్తించారు. హిమాచట్ ప్రదేశ్ సోలన్ జిల్లా భటౌలీ ఖుర్ద్ గ్రామంలోని ఆబాట్ హెల్త్ కేర్ ప్రైవేటు లిమిటెడ్ బ్యాచ్ నెంబర్ ఈపిబి23012కు చెందిన ఎప్టోయిన్ టాబ్లెట్లు (ఫెనిటోయిన్ టాబ్లెట్లు ఐపి 100 ఎంజీ) నకిలీలతో పాటు జమ్మూ కాశ్మీర్ సిడ్కోలోని కాడిలా ఫార్మాస్యూటికల్స్ బ్యాచ్ నెంబర్ జేకేజి523050కు చెందిన వాసోగ్రైన్ టాబెట్లు ఎర్గోటమైన్, కెఫైన్, పారాసిటమాల్, ప్రొక్లో పెరిజైన్ టాబ్లెట్లు (1 ఎంజీ + 100 ఎంజీ + 230 ఎంటి + 2.5 ఎంజి) నకిలీ మందులను తయారు చేస్తున్నట్లు గుర్తించారు. వాటి విలువ సుమారు రూ.23 లక్షలు ఉంటుందని, వాటితో పాటు సుమారు రూ. 25 లక్షలు విలువ చేసే తయారీ, ప్యాకింగ్ సామాగ్రి, యంత్రాలు, పరికరాలతో పాటు టాబ్లెట్లకు వినియోగించే ముడి సరుకులైన మొక్కజొన్న పిండి, పౌడర్లు, మైక్రో క్రిస్టలైన్ సెట్యూలోజ్, టైటానియం డయాక్సైడ్, మెగ్నీషియం స్టిరేట్ వంటి రసాయనాలు పట్టుకొని స్వాధీనం చేసుకున్నామని డీసీపీ తెలిపారు.

టాబ్లెట్ రంగుల్లో కనిపిస్తున్న మార్పు

• ఆదుపులోకి తీసుకున్న నిందితులు…
ములుగు జిల్లా వెంకటాపూర్ మండలంలోని పొరకాలపల్లి గ్రామానికి చెందిన గిర్నేని సంపత్ రావు కుమారుడు గిర్నేని గోపాల్ (42) ను ఏ1గా, ఢిల్లీకి చెందిన నిహాల్ ను ఏ2గా, తూర్పు గోదావారి జిల్లా అంబాజీపేట మండలంలోని పుల్లేటికూర గ్రామానికి చెందిన నర్సింహా మూర్తి కుమారుడు జగద్గిరిగుట్ట సంజయవురి కాలనీలోని మార్కండేయ హోటల్ సమీపంలో నివాసముంటున్న బొక్కా రామకృష్ణ (40) ను ఏ3గా పోలీసులు కేసు నమోదు చేశారు. గోపాల్, రామకృష్ణను పోలీసులు అదుపులోకి తీసుకోగా ఢిల్లీకి చెందిన నిహాల్ పరారీ ఉన్నాడు. గోపాల్ 1999లో మెరుగైన జీవనోపాధి కోసం వలస వచ్చి నిజాంపేట మధురానగర్ లోని సాయి బాలాజీ హైట్స్ లో నివాసం ఉంటున్నాడు. కూకట్ పల్లి ప్రశాంత నగర్ లో గోపాల్ 2001లో హరిణి ఇండస్ట్రీస్ పేరుతో ప్లాస్టిక్ మోల్డింగ్ పరిశ్రమను ఏర్పాటు చేశాడు. కరోనా సమయంలో సదరు వరిశ్రమ ఆర్థికంగా నష్టపోయింది. ఆ సమయంలో ఢిల్లీకి చెందిన అతని వినియోగదారుడు నిహాల్ పెద్ద మొత్తంలో డబ్బును సులువుగా సంపాదించే మార్గంలో భాగంగా నకిలీ మాత్రల తయారీ పద్దతిని ప్రతిపాదించాడు. మాత్రల తయారీకి ముడి సరుకులు, ప్యాకింగ్ సామాగ్రి, లేబుల్స్, అల్యూమినియం స్ట్రిప్ ఫాయిల్స్, మార్కెట్ లో పేరున్న ఫార్మా పరిశ్రమల డబ్బాలను సరఫరా చేస్తానని తెలిపాడు. నిహాల్ పంపిన ముడి సరుకుతో మాత్రలను తయారు చేసి ప్యాకింగ్ చేసి ఇవ్వాలని దాని కోసం ఒక్కో మాత్రకు 10 పైసలు చెల్లిస్తానని ఒప్పందం కుదుర్చుకున్నాడు. అనంతరం దూలపల్లిలో ఓ పరిశ్రమను స్థాపించి నకిలీ మాత్రల తయారీకి కావల్సిన యంత్రాలు, పరికరాలను గోపాల్ ఏర్పాటు చేశారు.

 

కల్తీ మందుల తయారీ కోసం ఉపయోగించిన యంత్రాలు

మందుల తయారీలో అనుభవం ఉన్న మాజీ ఉద్యోగి రామకృష్ణకు నకిలీ మందుల విషయం వివరించడంతో దురాశతో అతను వెంటనే ఆంగీకరించాడు. అనంతరం 2023 డిసెంబర్ నెలలో ఒప్పందం ప్రకారం నిహాల్ నకిలీ మాత్రల తయారీకి కావాల్సిన ముడి పదార్ధాలు, ఆబాట్, కాడిలా సంస్థలకు చెందిన రెండు రకాల మాత్రల మిశ్రమం (కంపోజిషన్), ప్యాకింగ్ సామాగ్రి, డబ్బాలను పంపాడు.

తేదీల ప్రచురణలో వ్యత్యాసం

• ఇప్పటి వరకు తయారు చేసిన మందులు…
ఆప్పటి నుంచి కల్తీ మందులు తయారీని ప్రారంభించిన గోపాల్, రామకృష్ణ ఇప్పటి వరకు 1,03,68,000 ఆబాట్ కు చెందిన ఎప్టోయిన్ (100 ఎంజీ) నకిలీ మాత్రలను తయారు చేసి సీసాల్లో ప్యాక్ చేశారు. అలాగే కాడిలాకు చెందిన వాసోగ్రైన్ మాత్రలను 14,28,810 తయారు చేసి స్ట్రిప్పుల్లో ప్యాక్ చేశారు. వాటిలో ఎప్టోయిన్ మాత్రలు 86,400 లెబుల్ వేసిన సీసాలు, వాసోగ్రైన్ మాత్రలు 85,428 స్ట్రిప్పులను వివిధ తేదీల్లో ప్రైవేటు రవాణా వాహనాల ద్వారా ఢిల్లీలోని నిహాల్ కు సరఫరా చేశారు. దీంతో నిందితులను ఆదుపులోకి తీసుకున్న పేట్ బషీరాబాద్ పోలీసులు నూతనంగా అమల్లోకి వచ్చిన భారత న్యాయ సంహిత (బీఎన్ఎస్) ద్వారా కేసులు నమోదు చేశారు.

నకిలీ మందుల గుట్టు రట్టు చేయడంలో కీలక పాత్ర పోషించిన ఎస్ వో టీ డీసీపీ డి. శ్రీనివాస్, ఎస్ వో టీ అదనపు డీసీపీ శోభనకుమార్, మేడ్చల్ ఎస్ వో టీ ఇన్స్ పెక్టర్ శ్యాంసుందర్ రెడ్డి, పేట్ బషీరాబాద్ ఏసిపి రాములు, సీఐ విజయవర్థన్, సిబ్బంది, డ్రగ్స్ ఇన్స్ పెక్టర్ హేమలతలను డీసీపీ అభినందించారు.

Leave A Reply

Your email address will not be published.

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More