బీఆర్ఎస్.. కాంగ్రెస్ నేతల తీరు
బీఆర్ఎస్ లో చేరిన నందికంటి శ్రీధర్
హైదరాబాద్ (న్యూస్ విధాత్రి), అక్టోబర్ 4: రానున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాజకీయ పార్టీల నేతలు ఆ పార్టీ నుంచి ఈ పార్టీలోకి…ఈ పార్టీ నేతలు ఆ పార్టీలోకి కుండ మార్పులు చేసుకున్నట్లుగా కండువాలు మార్చుకుంటున్నారు. ఎమ్మెల్యే కుర్చీలాటలో నువ్వా…నేనా అన్నట్లుగా పార్టీలు మారుతున్నారు. ప్రస్తుతం ఉన్న పార్టీలో ఎమ్మెల్యే సీటు దక్కకపోవడం, ఇకముందు దక్కుతుందనే నమ్మకం లేకపోవడంతో పక్క పార్టీల వైపు చూస్తున్నారు. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన మేడ్చల్ మల్కాజ్గిరి డిసిసి అధ్యక్షుడు నంది కంటి శ్రీధర్ బుధవారం బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. ఆయనను మంత్రి కేటీఆర్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
అయితే మల్కాజ్గిరి బీఆర్ఎస్ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకోవడంతో ఆ పార్టీలో తనకు సదరు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా అవకాశం దక్కదనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీకి శ్రీధర్ రాజీనామా చేసి బీఆర్ఎస్ లో చేరారు.
అంతకుముందు తన కుమారుడు మైనంపల్లి రోహిత్ కు బీఆర్ఎస్ టికెట్ ఇవ్వలేదని మైనంపల్లి హనుమంతరావు ఆ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకోవడం తెలిసిందే.