ఇరిగేషన్ ఎన్ ఓ సి లేకుండానే ఎఫ్ టి ఎల్ లో నిర్మాణ అనుమతులు

 

– ఎన్నా చెరువులో జిహెచ్ఎంసి అధికారుల నిర్వాకం
– తక్షణ అనుమతులతో నిర్మాణాలు పూర్తి చేసుకున్న భవన నిర్మాణదారులు
– నిర్మాణదారులకు సహకరిస్తున్న ఇరిగేషన్ రిటైర్డ్ ఏఈ రామారావు
– ప్రజావాణిలో ఫిర్యాదు చేసిన బిజెపి నాయకులు
కుత్బుల్లాపూర్ (న్యూస్ విధాత్రి), సెప్టెంబర్ 23 : కుత్బుల్లాపూర్ సర్కిల్లోని జీడిమెట్ల డివిజన్ పరిధి వెన్నెలగడ్డలోని ఉన్న ఎన్నా చెరువు ఎఫ్టిఎల్ లో నిబంధనలకు విరుద్ధంగా నిర్మిస్తున్న పలు భవనాలపై సర్కిల్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో బిజెపి నాయకుడు ఆకుల సతీష్ ఫిర్యాదు చేశారు. జీడిమెట్ల గ్రామంలో 38 ఎకరాల్లో ఎన్నో చెరువు విస్తరించి ఉందని, దానిలో ఇప్పటికే సుమారు 8 ఎకరాలు కబ్జా చేసుకుని పలువురు ప్రహరీలను ఏర్పాటు చేసుకోగా మరి కొంతమంది అక్రమ అనుమతులు పొంది నిర్మాణాలు చేపడుతున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. 2023 సంవత్సరంలో జిహెచ్ఎంసి పట్టణ ప్రణాళిక అధికారులు చెరువు ఎఫ్ టి ఎల్, బఫర్ జోన్ పరిధిలో ఇరిగేషన్ నుంచి ఎటువంటి ఎన్ ఓ సి (నిరభ్యంతర పత్రం) పొందకుండానే నాలుగు నిర్మాణాలకు తక్షణ అనుమతులను జారీ చేశారు. ఎన్నా చెరువు ఎఫ్టిఎల్, బఫర్ జోన్ లో అక్రమ అనుమతులతో అక్రమ నిర్మాణాలు జరుగుతున్న ఇరిగేషన్ రిటైర్డ్ ఏ ఈ రామారావు చర్యలు తీసుకోకుండా సహకరించడం పై తక్షణమే చర్యలు తీసుకొని చెరువులో నిర్మాణాలు కూల్చివేయాలని తెలిపారు. అలాగే అక్రమ నిర్మాణదారులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేస్తూ కుత్బుల్లాపూర్ డిప్యూటీ కమిషనర్ వి. నరసింహ, కూకట్ పల్లి జోనల్ కమిషనర్ అపూర్వ్ చౌహాన్ కి ఫిర్యాదు చేశారు.

తక్షణ అనుమతులతో పూర్తయిన నిర్మాణాలు

అనంతరం ఆకుల సతీష్ మాట్లాడుతూ… జీడిమెట్ల గ్రామంలోని ఎన్నా చెరువు 38 ఎకరాల విస్తీర్ణంలో ఉందని ప్రాథమిక నోటిఫికేషన్ 2013 ద్వారా గుర్తిస్తూ హెచ్ఎండిఏ ఉత్తర్వులు జారీ చేసిందని, కానీ…గత 9 సంవత్సరాలు ఈ చెరువు ఎఫ్ టి ఎల్, బఫర్ ను మట్టితో పూడ్చి వేయడమే కాకుండా ప్రహరీ గోడలను, చిన్న నిర్మాణాలను చేస్తూ దాదాపు 8 ఎకరాల పైచిలుకు కబ్జా గురైందన్నారు. ఓ పక్క ప్రస్తుత తెలంగాణ ప్రభుత్వము చెరువులు, నాళాలు, ప్రభుత్వ స్థలాలను కబ్జాల నుంచి రక్షించి భవిష్యత్తుతరాలకి అందించే ప్రయత్నం చేస్తున్న తరుణంలో మరోపక్క అధికారులు ఎన్నా చెరువు ఎఫ్ టి ఎల్, బఫర్ జోన్ లో గ్రీన్ పార్క్ ఎవెన్యూస్ గేటెడ్ కమ్యూనిటీ లో 4 కొత్త నిర్మాణాలకు ఎలా అనుమతులు మంజూరు చేస్తారని ప్రశ్నించారు.

చెరువు స్థలంలో ఏర్పాటు చేసిన ప్రహరీ గోడ

ఇంత జరుగుతున్న నార్త్ ట్యాంక్ ఇరిగేషన్ అధికారులు ఎందుకు చర్యలు తీసుకోకుండా నిర్మాణాలకు సహకరిస్తున్నారని, అంతేకాకుండా చెరువు స్థలం కబ్జాకు గురవుతున్న రిటైర్ అయి 10 సంవత్సరాల నుండి ఇన్చార్జిగా కొనసాగిస్తున్న నార్త్ ట్యాంక్ కుత్బుల్లాపూర్ ఇరిగేషన్ ఏఈగా ఇంకా విధులు నిర్వహిస్తున్న రామారావు ప్రధాన పాత్ర పోషిస్తున్నారని ఆరోపించారు. ఇరిగేషన్ శాఖ ఎన్ ఓ సి లేకుండానే ఇచ్చిన అక్రమ నిర్మాణ అనుమతులను తక్షణమే రద్దు చేసి నిబంధనలకు విరుద్ధంగా అనుమతులు మంజూరు చేసిన సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

చెరువు బఫర్ జోన్ లో నిర్మితమైన బహుళ అంతస్తుల భవనం

అక్రమ అనుమతులు పొంది నిర్మాణాలు చేపట్టిన నిర్మాణదారులపై క్రిమినల్ కేసు నమోదు చేయడమే కాకుండా వారికి సహకరిస్తున్న రామారావు ను తక్షణమే విధుల నుంచి తొలగించి తగిన చర్యలు తీసుకోవాలని అన్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు ఎన్నా చెరువు 38 ఎకరాలను గుర్తించి హద్దులను ఏర్పాటు చేసి పరిరక్షించాలని వారు డిమాండ్ చేశారు. సాధ్యమైనంత త్వరగా సదరు అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలని, లేనిపక్షంలో ఉన్నతాధికారుల దృష్టికి దృష్టికి తీసుకెళ్తామని హెచ్చరించారు. ఫిర్యాదు అందించిన వారిలో అమలేశ్వరి, అరుణ్ రావు, ఎల్ల స్వామి, చందు ఉన్నారు.

Leave A Reply

Your email address will not be published.

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More