ఉపశమనం అనుకునే లోపే ఉక్క పోత
కుత్బుల్లాపూర్ (న్యూస్ విధాత్రి), జూన్ 2 : కుత్బుల్లాపూర్ లోని చింతల్, సుచిత్ర, కొంపల్లి, షాపూర్ నగర్, జీడిమెట్ల తో పాటు పలు ప్రాంతాల్లో భారీ ఈదురు గాలులు, ఉరుములు, మెరుపులతో వర్షం కురిసింది. ఉదయం నుంచి ఎండ వేడితో అల్లాడిపోయిన ప్రజలు వర్షం కురవడంతో కొంత ఉపశమనం కలిగిందనే లోపే.. కరెంట్ కట్ రూపంలో ఉక్కపోతతో ఉడికిపోయారు. చింతల్ ప్రాంతంలోని పద్మా నగర్ ఫేజ్ -2, బ్యాంక్ కాలనీ, సాయిబాబా నగర్, సంజీవయ్య నగర్, ఎమ్ ఎన్ రెడ్డి నగర్ లతో పాటు పరిసర ప్రాంతాల్లోని పలు కాలనీలు బస్తీలలో 15 నిమిషాలు మాత్రమే వర్షం కురిసి ఆగిపోయిన విద్యుత్ సరఫరాను సుమారు మూడు గంటలపాటు నిలిపివేయడంతో ప్రజలు ఉక్కపోతతో ఉడికిపోయారు. సాయంత్రం సుమారు 4:30 గంటలకు పోయిన కరెంటు ఏడు గంటలు దాటిన రాకపోవడంతో ప్రజలు అధికారుల తీరుపై అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. భారీ ఈదురు గాలులకు బ్యాంక్ కాలనీ వద్ద ఉన్న విద్యుత్ లైను తెగిపోవడంతో దానిని పునరుద్ధరిస్తున్నామని అందువల్లే విద్యుత్ సరఫరా ల ఆలస్యం జరుగుతుందని అధికారులు తెలిపారు.