ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు అధికారులు అప్రమత్తంగా ఉండాలి. – ఎమ్మెల్యే వివేకానంద్
కుత్బుల్లాపూర్ (న్యూస్ విధాత్రి), సెప్టెంబర్ 2: ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాన్ని దృష్టిలో పెట్టుకొని కుత్బుల్లాపూర్, గాజులరామారం జంట సర్కిళ్ల పరిధిలోని లోతట్టు, నాలా పరివాహక ప్రాంతాల్లో ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండి ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే కేపీ. వివేకానంద్ జిహెచ్ఎంసి ఇంజనీరింగ్ అధికారులకు సూచించారు. ఈ మేరకు కుత్బుల్లాపూర్ సర్కిల్ కార్యాలయంలో ఉప కమిషనర్లు వి. నరసింహ, ఎల్ పి మల్లయ్య కలిసి ఎమ్మెల్యే సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. కురుస్తున్న వర్షాల నేపథ్యంలో ముంపుకు గురవుతున్న కాలనీలు, బస్తీల పరిస్థితులపై ఎమ్మెల్యే ఆరా తీశారు.
అలాగే గత వర్షాకాలంలో ఎదురైన పలు కాలనీలోని సమస్యలను దృష్టిలో పెట్టుకొని వాటిపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆయన ఆదేశించారు. ప్రధానంగా గాజులరామారంలోని ఓక్షిత ఎన్ క్లేవ్ పరిస్థితిని అడిగి తెలుసుకుని పెండింగ్ లో ఉన్న పనులను త్వరగా పూర్తి చేయాలని తెలిపారు. అలాగే కుత్బుల్లాపూర్ సర్కిల్ లోని ఫాక్స్ సాగర్ వరద కాలువ పొంగడం వల్ల ఇబ్బందులు తలెత్తుతున్నాయని దాని పరిష్కారానికి కృషి చేయాలన్నారు. రవి నారాయణ రెడ్డి నగర్, గాలి పోచమ్మ బస్తితో పాటు పరిసర ప్రాంతాల్లోని నారా పరివాహ ప్రాంతాలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ఎటువంటి ఇబ్బందులు కలవకుండా సత్వర చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అలాగే పెండింగ్లో ఉన్న ఎస్ ఎన్ డి పి (వ్యూహాత్మక నాలా అభివృద్ధి కార్యక్రమం) పనులను సంబంధిత అధికారులతో సమన్వయ పరచుకుని పూర్తి చేయాలని అన్నారు. వర్షాల వల్ల రహదారులపై వర్షపు నీరు నిల్వ ఉండి ఇళ్లల్లోకి నీరు చేరే ప్రాంతాలపై అప్రమత్తంగా ఉండి ఎప్పటికప్పుడు సిబ్బంది అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ప్రతి వర్షాకాలంలో సమస్యాత్మకంగా ఉంటున్న ప్రసూన నగర్, వాజ్పాయ్ నగర్, పద్మా నగర్ ఫేజ్ -2 తెలుగు తల్లి విగ్రహం వద్ద సమస్య పరిష్కారానికి వెంటనే చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఈ సమావేశంలో ఈఈ లు లక్ష్మీ గణేష్, కృష్ణప్ప, డిఈ రూపాదేవి, ఏఈలు మల్లారెడ్డి, కళ్యాణ్, సూరజ్, రవీందర్, స్వాతి, తిరుపతి, సిబ్బంది పాల్గొన్నారు.